11 స్థానాలు పెండింగ్: 53 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ ఎన్నికల కమిటి క్లియరెన్స్
కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఇవాళ జరిగింది.53 మంది అభ్యర్థుల జాబితాకు సీఈసీ ఆమోదం తెలిపింది.
హైదరాబాద్: కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం శుక్రవారం నాడు ఉదయం న్యూఢిల్లీలో జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. 11 స్థానాలు మినహా మిగిలిన 53 స్థానాలకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోద ముద్ర వేసింది.
ఈ నెల 15న తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. తొలి జాబితాలో 55 మంది అభ్యర్ధులకు చోటు దక్కింది. మిగిలిన 64 మంది పేర్లను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఇవాళ నిర్వహించారు. సుమారు గంటన్నరకు పైగా కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. సీపీఐ, సీపీఎంలతో పొత్తు విషయమై కూడ ఇవాళ స్పష్టత రానుంది.
ఈ రెండు పార్టీలకు నాలుగు అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే ఇతర పార్టీల నుండి చేరికలు, తాము కోరిన సీట్లు ఇవ్వాలని లెఫ్ట్ పార్టీలు కోరుతుండడంతో ఈ విషయమై పీటముడి నెలకొంది. సీపీఐ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు డి. రాజా, సీతారాం ఏచూరిలతో కాంగ్రెస్ అగ్రనేతలు ఈ విషయమై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ విషయాన్ని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ ,మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు , నీలం మధు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా కూడ ఇతర పార్టీల నుండి కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్న నేతలకు టిక్కెట్ల కేటాయింపు, లెఫ్ట్ పార్టీలతో సీట్ల సర్ధుబాటు అంశంపై కూడ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్చించింది.
అంతేకాకుండా గజ్వేల్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట వంటి స్థానాల్లో కాంగ్రెస్ అగ్రనేతలను బరిలోకి దింపే విషయమై కూడ ఈ సమావేశంలో చర్చించారని సమాచారం. 53 అసెంబ్లీ స్థానాలకు సీఈసీ క్లియరెన్స్ ఇచ్చింది.ఇవాళ సాయంత్రం లోపుగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసే అవకాశం ఉంది.
also read:బీజేపీకి గుడ్‌బై: కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఇతర పార్టీల నుండి చేరికలు, లెఫ్ట్ పార్టీల పొత్తు విషయమై 11 స్థానాలను పెండింగ్ లో ఉంచారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నిన్న జరగాల్సిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఇవాళ్టికి వాయిదా పడింది.ఇవాళ ఉదయమే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది.