రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా గండిపేట సీబీఐటీ కళాశాల వద్ద ఇంజనీరింగ్ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫీజులు తగ్గించాలంటూ గత మూడు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మూడు రోజులుగా తరగతులను బహిష్కరించిన విద్యార్థులు....ఈరోజు జరగాల్సిన మిడ్ పరీక్షలను సైతం బహిష్కరించారు. 

గతంలో ఏ కేటగిరికి చెందిన విద్యార్థులకు ఫీజులు తగ్గించారని....అలాగే బీ కేటగిరి విద్యార్థులకు కూడా ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఫీజుల తగ్గింపుపై ఆలోచిస్తామని చెప్పిన యాజమాన్యం ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండానే పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు.  

బీ కేటగిరి విద్యార్థులకు వాస్తవానికి ఫీజు లక్ష 13 వేలు. అయితే దాన్ని కళాశాల యాజమాన్యం 2లక్షలకు పెంచడంతో దాన్ని కట్టలేమని విద్యార్థులు ఆందోళనకు దిగారు. మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని తమ సమస్యను పరిష్కరించాలని కోరితే ఇద్దరు విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 

ఫీజులు తగ్గించే వరకు తమ ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సీబీఐటీ దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు. 


"