హైదరాబాద్: ఇసుక మాఫియాతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఉత్తరప్రదేశ్ ఐఎఎస్ అధికారి బి. చంద్రకళ స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా. ఆమె స్వస్థలంలోనూ సిబిఐ మెరుపుదాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో సిబిఐ అధికారులు దేశంలోని 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. 

ప్రస్తుతం చంద్రకళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ జిల్లా మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్నారు. ఆమె 2008 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఎఎస్ అధికారి. ఆమె 1979 సెప్టెంబర్ 27వ తేదీన కరీంనగర్ జిల్లాలోని గర్జనపల్లి గ్రామంలో జన్మించారు. 

గిరిజన తెగకు చెందిన ఆమె కఠినంగా శ్రమించి ఐఎఎస్ సాధించారు. చంద్రకళ ఐఎఎస్ పరీక్షల్లో 409వ ర్యాంక్ సాధించారు. ఆమెకు కూతురు ఉంది. ఆమె భర్త ఎ రాములు లోయర్ మానేరు డ్యామ్ శ్రీరాంసాగర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పనిచేస్తూ వచ్చారు. 

బిఎ చదవడానికి ఆమె హైదరాబాదులోని కోఠీ ఉమెన్స్ కాలేజీలో చేరారు. అయితే ద్వితీయ సంవత్సరంలో ఉండగానే ఆమెకు వివాహమైంది. దాంతో ఆమె చదువు ఆగిపోయినట్లే అయింది. కానీ, ఆమె దాంతో ఆగిపోలేదు. దూర విద్య ద్వారా ఎంఎ (ఎకనమిక్స్) చదివారు. భర్త పిల్లల బాగోగులు చూసుకుంటుండగా ఆమె గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యారు. 

ఆమె తొలుత అలహాబాద్ సిడిఓగా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత 2012 ఏప్రిల్ లో హమీర్ పూర్ డిఎంగా పదవీబాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2014 జూన్ 8వ తేదీన మథుర డిఎంగా బదిలీ అయ్యారు. మథుర జిల్లా మెజిస్ట్రేట్ గా పనిచేసిన రెండో మహిళా అధికారి ఈమెనే. అంతకు ముందు అనిత మెష్రామ్ జిల్లా మెజిస్ట్రేట్ గా పనిచేశారు. 

అక్కడ కూడా ఆమె కొద్దికాలమే పనిచేశారు. 129 రోజుల వ్యవధిలోనే ఆమె బులంద్ షహర్ జిల్లా మెజిస్ట్రేట్ గా బదిలీ అయ్యారు. 

సంబంధిత వార్త

చంద్రకళ ఇంటిపై సిపిఐ దాడులు: ఆమెది కరీంనగర్ జిల్లా