Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో రైల్వే ఇంజనీర్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు

దక్షిణ మధ్య రైల్వేలో ఇంజనీర్‌‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు అరెస్ట్ చేశారు. లంచం తీసుకుంటండగా అతన్ని పట్టుకున్న సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

CBI officers arrest railway engineer in hyderabad over bribe
Author
First Published Jun 30, 2022, 1:30 PM IST

దక్షిణ మధ్య రైల్వేలో ఇంజనీర్‌‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు అరెస్ట్ చేశారు. లంచం తీసుకుంటండగా అతన్ని పట్టుకున్న సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. సీబీఐకి చెందిన అవినీతి నిరోధక విభాగం బుధవారం హైదరాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వేలో సీనియర్ స్థాయి ఇంజనీర్‌గా పనిచేస్తున్న సురేష్ కుమార్ నివాసంలో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఉప్పల్, జమ్మికుంట ఆర్వో బ్రిడ్జి కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ సురేష్ అధికారులు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. 

దీంతో సీబీఐ అధికారులు సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత తార్నాకలోని సురేష్ ఇల్లు, ఇతర ప్రాంతాల్లో అతని కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు చేపట్టారు. అనంతరం సురేష్‌ను అరెస్ట్ చేసిన అధికారులు.. రిమాండ్‌కు తరలించారు. 

ఇదిలా ఉంటే.. హర్యానాలోని అంబాలాలో రూ. 1.80 లక్షలు లంచం డిమాండ్ చేసి స్వీకరించినందుకు ఇద్దరు రైల్వే అధికారులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్టు చేశారు. సీనియర్ డివిజనల్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ వివేక్ లంగాయన్, చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ పవన్ కుమార్‌లు అంబాలా కంటోన్మెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. అయితే వీరిపై స్థానిక కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. 

ఇందుకు సంబంధించి సీబీఐ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘ ఫిర్యాదుదారు నుంచి రూ. 1,80,000 లంచం డిమాండ్ చేసి.. దానిని స్వీకరిస్తుండగా సీబీఐ వల వేసి నిందితులను పట్టుకుంది. ఇద్దరు నిందితులకు చెందిన అంబాలాలోని నివాస, కార్యాలయ ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించబడ్డాయి. ఇది నేరారోపణ పత్రాలను రికవరీ చేయడానికి దారితీసింది. నిందితులిద్దరినీ బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచాల్సి ఉంది’’ అని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios