ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్ట్ అనుమతించింది. ఈ నెల 21 నుంచి 29 వరకు ఆయన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కోర్టులో ఊరట లభించింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన యూరప్ వెళ్లేందుకు సీబీఐ కోర్ట్ జగన్మోహన్ రెడ్డికి అనుమతించింది. దీనికి సంబంధించి జగన్ ఈ నెల 10న సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా.. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించినట్లు తెలిపింది. అలాగే సెల్‌ఫోన్, ఈ మెయిల్ ఐడీ, పర్యటన వివరాలు న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించింది. మొత్తం మీద ఈ నెల 21 నుంచి 29 వరకు యూరప్ పర్యటనకు వెళ్లేందుకు జగన్‌కు అనుమతి లభించినట్లయ్యింది.
ఇదిలావుండగా.. సీఎం విదేశీ పర్యటన రద్దుపై రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. గత నెల 17న కూడా పీఎం ను కలిసి సీఎం జగన్ వినతిపత్రం ఇచ్చారని సీఎస్ తెలిపారు. అనేకసార్లు సీఎం ఇచ్చిన వినతుల్లో కొన్ని అంశాలపై ఈ వారంలో క్లారిటీ రానుందని ఆయన పేర్కొన్నారు. సీఎం కూడా ఢిల్లీ రావాల్సి ఉంటుందని జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
ALso Read: జగన్ విదేశీ పర్యటన రద్దు, వసతి దీవెన వాయిదా.. ఎందుకిలా : క్లారిటీ ఇచ్చిన సీఎస్ జవహర్ రెడ్డి
అందుకే వ్యక్తిగత పర్యటనలు రద్దు చేసుకోవాలని సీఎంను కోరామని సీఎస్ స్పష్టం చేశారు. వసతి దీవెన నిధులు విడుదలకు సరిపడా నిధులు లేవని అందువల్ల వాయిదా వేయాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులు సూచించారని సీఎస్ పేర్కొన్నారు. పాలనాపరమైన కారణాల వల్లే వసతి దీవెన వాయిదా పడిందని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఏడాదిన్నరగా కేంద్రంతో జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయని ఆయన వెల్లడించారు. రెవెన్యూ లోటు నిధుల విడుదలపై త్వరలో స్పష్టత రానుందని సీఎస్ చెప్పారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నామని.. రేపు ఢిల్లీ వెళ్తున్నామని, అవసరాన్ని బట్టి సీఎం కూడా వస్తారని జవహర్ రెడ్డి వెల్లడించారు.
