నేడు ఎల్వీప్రసాద్ లో చంద్రబాబుకు కాటరాక్ట్ ఆపరేషన్..!
కంటి సంబంధిత సమస్యతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లనున్నారు.
హైదరాబాద్ : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ చేరారు. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకి డిశ్చార్జి కానున్నారు. అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నేరుగా చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్ లోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్ళనున్నట్టుగా సమాచారం.
ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కాటరాక్ట్ సమస్యలకు చంద్రబాబుకు వైద్యులు శస్త్ర చికిత్స చేయనున్నట్లుగా తెలుస్తోంది. మధ్యంతర బెయిలుపై విడుదలైన చంద్రబాబు నాయుడు గురువారం నాడు హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణులు డాక్టర్ కే రాజేష్ ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్ తో పాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాలకు చెందిన డాక్టర్ల బృందం చంద్రబాబుకు వివిధ పరీక్షలు సూచించారు.
కాలేయ, మూత్రపిండాల పనితీరు, రక్త, మూత్ర పరీక్షలు, 2డీ ఎకో, ఈసీజీ, అలర్జీ స్క్రీనింగ్ లాంటి టెస్టులు చేసినట్లుగా సమాచారం. చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నప్పుడు తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడ్డారు. తీవ్ర అలర్జీతోపాటు.. ఇతర అనారోగ్య కారణాల వల్ల కోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. మంగళవారం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు నాయుడు బుధవారం హైదరాబాదుకు చేరుకున్న సంగతి తెలిసిందే.