ఓటుకు నోటు కేసు: ఒకే దెబ్బ రెండు పిట్టలు, కేసీఆర్ వ్యూహం ఇదీ

Cash for Vote: KCR strategy to hit both
Highlights

ఓటు నోటు కేసును తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మళ్లీ తెర మీదికి తేవడం వెనక పక్కా వ్యూహం ఉందని అంటున్నారు.

హైదరాబాద్: ఓటు నోటు కేసును తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మళ్లీ తెర మీదికి తేవడం వెనక పక్కా వ్యూహం ఉందని అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టే వ్యూహం అందులో దాగి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, తెలంగాణ కాంగ్రెసు నాయకుడు రేవంత్ రెడ్డిని ఒకేసారి దెబ్బ తీయాలనే వ్యూహంలో భాగంగానే కేసిఆర్ సోమవారం ఓటుకు నోటు కేసుపై సమీక్ష నిర్వహించినట్లు చెబుతున్నారు. 

చంద్రబాబును కేసులో ఎ1గా చేర్చబోతున్నట్లు చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన పత్రిక సాక్షి రాసింది. అందులో ఏ మేరకు నిజం ఉందనేది చెప్పలేం గానీ చంద్రబాబును ఇరకాటంలో పెట్టే రాజకీయ వ్యూహం మాత్రం తప్పకుండా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికను తెలంగాణ ఎసిబి డైరెక్టర్ జనరల్ పూర్ణచంద్రరావు సోమవారంనాటి సమీక్షా సమావేశంలో సమర్పించినట్లు చెబుతున్నారు. దానిపై న్యాయనిపుణులను కేసిఆర్ సంప్రదించినట్లు చెబుతున్నారు. 

ఈ కేసు త్వరలో సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో కేసిఆర్ సమీక్ష చేసినట్లు చెబుతున్నారు. కేసులో నిందితుడైన జెరూసలెం మత్తయ్య అప్రూవర్ గా మారుతానని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. 

ప్రధాని నరేంద్ర మోడీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మధ్య విభేదాలు పొడసూపి, కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తుతున్న నేపథ్యంలో ఈ కేసు తిరిగి తెర మీదికి రావడం అనేది రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు. 

15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోతలు పెట్టిన విషయంపై చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, రాష్ట్రాల హక్కులను బలహీనపరుస్తోందని విమర్శించిన రోజున ఆ కేసు తిరిగి తెర మీదికి వచ్చింది. 

కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెసులో చేరి, కేసిఆర్ పై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. 2019 ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డిని కార్నర్ చేయాలనే వ్యూహం కూడా కేసిఆర్ అమలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. 

loader