హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ అలజడి రేపుతోంది. గత కొద్ది రోజులుగా ఓటుకు నోటు కేసు వ్యహారం తెరపైకి రావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది. 

తాజాగా ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి, ఆయన తనయుడు వేం కీర్తన్ రెడ్డిలు మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణకు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. 

నరేందర్ రెడ్డిని రాజశేఖర్ బృందం ప్రశ్నిస్తోంది. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షల రూపాయలపై కూపీ లాగుతోంది. అలాగే నాలుగునర్న కోట్లు ఎక్కడివంటూ ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. 

అంతేకాదు వేం నరేందర్ రెడ్డికి చెందిన బ్యాంక్ అకౌంట్స్ ఎదుట పెట్టి మరీ గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తోంది. మనీ ల్యాండరింగ్ వ్యవహారంపైనా ఆరా తీస్తోంది ఈడీ బృందం. ఇకపోతే ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహలను ఇప్పటికే ఈడీ విచారించింది.