ప్రియుడితో కలిసి భర్తను చంపేసి బైక్ పై చెక్కేసి డ్రామా

Case thought to be a suicide, is a murder
Highlights

ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను మట్టుబెట్టింది.

నల్లగొండ: ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను మట్టుబెట్టింది. తొలుత పోలీసులు అతను ఆత్మహత్య చేసుకున్నాడని భావించారు. కానీ, తిరిగి దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. నల్లగొండ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మహిళను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసారు. 

దినసరి కూలీ అయిన ములుగూరి వెంకటేశ్వర్లు (45) నల్లగొండ పట్టణంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. గత ఆగస్టులో ఈ సంఘటన జరిగింది. తాను స్వస్థలం వెళ్లినప్పుడు తన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని భార్య మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఆ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించి, శవాన్ని కుటుంబ సభ్యులకు కూడా అప్పగించారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో హత్య జరిగినట్లు తేలింది.  దాంతో పోలీసులు కేసును తిరిగి తెరిచి దర్యాప్తు సాగించారు. 

పోలీసులు మాధవి కాల్ డేటాను పరిశీలించారు. వెంకటేశ్వర్లు మరణించినప్పుడు ఆమె ఇంట్లోనే ఉన్నట్లు తేలింది. తాను స్వస్థలానికి వెళ్లినట్లు మాధవి చెప్పిన మాటలు నిజం కాదని బయటపడింది. 

విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది. వెంకటేశ్వర్లును మాధవి, శెట్టిపాలెం వేములపల్లికి చెందిన తన ప్రియుడు నిమ్మల వెంకన్నతో కలిసి గొంతు నులిమి చంపి ఆ తర్వాత శవానికి ఉరి వేసినట్లు తేలింది. 

భర్తను చంపిన తర్వాత మాధవి వెంకన్న మోటార్ సైకిల్ పై వెళ్లిపోయింది. వెంకటేశ్వర్లును చంపడానికి వాడిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు 

loader