హైదరాబాద్ గౌలిగౌడలోని సీబీఎస్ నుంచి ఈ నెల 24న చోరీకి గురైన కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. జామే ఉస్మానియా ప్రాంతానికి చెందిన సయ్యద్ అబేద్, సయ్యద్ జెహాద్ సోదరులు ఈ బస్సును తస్కరించి.. గంటల వ్యవధిలోనే మహారాష్ట్రలోని నాందేడ్‌కు తరలించినట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.

అయితే లక్షల విలువ చేసే ఆర్టీసీ బస్సును దొంగలు స్క్రాప్ వ్యాపారులకు కేవలం లక్ష రూపాయలకు అమ్మినట్లు సీపీ వెల్లడించారు. ఒప్పందం ప్రకారం ముందుగా 60 వేలు ముట్టగానే.. బస్సును నాందేడ్‌లోని స్క్రాప్ వ్యాపారులకు అప్పగించారు.

అఫ్జల్‌గంజ్ పోలీసులు నాందేడ్ వెల్లడంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా.. బస్సు ఆనవాల్లు కూడా లేకుండా పోయేవని ఆయన వివరించారు. చోరికి పాల్పడిన ఇద్దరిపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసులో నాందేడ్‌‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి నవీద్ పరారీలో ఉన్నాడని అంజనీకుమార్ తెలిపారు.