తాండూర్ సీఐని అసభ్యకరంగా దూషించిన కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు అధికారులు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నావంటూ ఫోన్ చేసి మరి ఫైరయ్యారు. సీఐ అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగారు మహేందర్ రెడ్డి. 

తాండూర్ సీఐని అసభ్యకరంగా దూషించిన కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఫోన్‌లో తాండూరు సీఐని ఆయన బూతులు తిట్టారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు.. ఐపీసీ 353, 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

అంతకుముందు తాండూర్‌ (tandur) సీఐపై టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి (patnam mahender reddy) బూతు పురాణం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఐని అసభ్యకరంగా తిడుతూ రెచ్చిపోయారు మహేందర్ రెడ్డి. తాండూర్ సీఐ రాజేందర్ రెడ్డిపై ఆయన రెచ్చిపోయారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి (rohit reddy) వత్తాసు పలుకుతున్నావంటూ ఫైరయ్యారు. సీఐ అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. 3 రోజుల క్రితం బహిరంగ సభలో ఎస్సైపై విరుచుకుపడ్డారు మహేందర్ రెడ్డి. 

కాగా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్‌లో లుకలుకలు మొదలయ్యాయ్. నేతల మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో వాళ్లు చేస్తున్న కామెంట్స్ కూడా వివాదాస్పదం అవుతున్నాయి. తాండూరు నియోజకవర్గంలో.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మధ్య మరోసారి అగ్గి రాజుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే కారణమనే ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో.. తాండూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని.. పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరులో తాను పనిచేసుకుంటుండగానే.. ఎమ్మెల్సీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. పార్టీ శ్రేణులు, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని భావించిన రోహిత్ రెడ్డి.. విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఇక.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య సఖ్యత కుదరక.. తాండూరు టీఆర్ఎస్‌లోని రెండు వర్గాల నాయకుల మధ్య ఘర్షణలు, దాడులు కూడా చోటు చేసుకున్నాయ్. దీంతో.. అధిష్టానం పిలిచి మందలించినా.. ఇద్దరిలో ఎలాంటి మార్పు రావడం లేదని.. సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. మరి ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఇద్దరు నేతల మధ్య అధిష్టానం రాజీ కుదురుస్తుందో లేదో వేచి చూడాలి.