తీన్మార్ మల్లన్న రూ. 30 లక్షలు డిమాండ్ చేశాడన్న ఫిర్యాదుతో అతని మీద హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. క్యూ టీవీ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ మీద చిలకలగూడా ఠాణాలో కేసు నమోదయ్యింది.

సీతాఫల్ మండి డివిజన్ మధురానగర్ కాలనీలో మారుతి సేవా సమితి పేరిట లక్ష్మీకాంతశర్మ జ్యోతిషాలయం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 19న తీన్మార్ మల్లన్న తనకు ఫోన్‌ చేసి రూ.30 లక్షలు డిమాండ్‌ చేశాడని లక్ష్మీకాంతశర్మ తెలిపాడు. అంతేకాదు డబ్బులు ఇవ్వకపోవడంతో 20వ తేదీన తనమీద తప్పుడు కథనాలు ప్రసారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

ఈ కేసు మీద లక్ష్మీకాంతశర్మ ఈ నెల 22వ తేదీన పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వడంతో తీన్మార్ మల్లన్న మీద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్టు చిలకలగూడా సీఐ నరేష్‌ తెలిపారు. 

కాగా, తీన్మార్ మల్లన్న ఇటీవల తెలంగాణలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ- వరంగల్- ఖమ్మం స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ పోటీలో మల్లన్నకు..  బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తూ‌ ప్రజల్లో తనదైన పాపులారిటీ తెచ్చుకుంటున్నాడు తీన్మార్ మల్లన్న. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలోనూ ఆయన పోటీ చేస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఉప ఎన్నికలో తాను పోటీచేయడం లేదని చెప్పి, పోటీకి దూరంగానే ఉన్నాడు. 

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కాచవాని సింగారంలో మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా త్వరలో 6 వేల కి.మీ పాదయాత్ర చేపట్టబోతున్నట్లు తెలిపాడు. తీన్మార్‌ మల్లన్న టీమ్‌ పేరిట రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పకొచ్చాడు. అయితే తాను రాజకీయ పార్టీ పెట్టడం లేదని క్లారిటీ ఇచ్చాడు.