నిబంధనలకు విరుద్దంగా వస్తువులను, నిత్యావసరాలను విక్రయిస్తూ వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్న బడా షాపింగ్ మాల్స్ పై తూనికలు, కొలతల శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. కొలతల శాఖ నిబంధనలకు ఉల్లంఘించడంతో పాటు, జీఎస్టీ పన్నుల పేరుతో వినియోగదారులపై ఈ షాపింగ్ మాల్స్ భారం మోపుతున్నాయని అధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ షాపింగ్ మాల్స్ పై అధికారులు 125 కేసులు నమోదు చేశారు.

గురువారం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పలు షాపింగ్‌ మాల్స్‌, సూపర్‌ మార్కెట్‌లపై తూనికల కొలతల శాఖ తనిఖీలు నిర్వహించింది.  32 మంది అధికారులు 16 బృందాలుగా ఏర్పడి గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మనికొండ, మాధాపూర్‌, హైటెక్‌ సిటీ, బాచుపల్లి, కొంపెల్లి, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, నాంపల్లి, శేరీలింగంపల్లి, గచ్చిబౌలి, బేగం బజార్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట్‌ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో జీఎస్టీతో పాటు తూనికల శాఖ నిబంధనలను కూడా వివిధ షాపింగ్ మాల్స్ ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. దీంతో రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌-18, హెరిటేజ్‌ సూపర్‌ మార్కెట్‌-13, మోర్‌ సూపర్‌ మార్కెట్‌-5, స్పెన్సర్స్‌-7, బిగ్‌బజార్‌-15, విజేత సూపర్‌ మార్కెట్‌, మహావీర్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ హార్డ్‌వేర్‌, భగవతి పెయింట్స్‌ అండ్‌ హార్డ్‌వేర్‌, బిగ్‌ సి, హైపర్‌ మార్కెట్‌... తదితర షాపింగ్‌ మాల్స్‌పై మొత్తం 125 కేసులు నమోదు చేశారు. 

 ఇటీవల కొన్ని వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ తగ్గించగా, మరికొన్ని వస్తువులపై జీఎస్‌టీని తొలగించిన విషయం  అందరికీ తెలిసిందే. అయితే తగ్గించిన జీఎస్‌టీ ధరల ప్రకారం షాపింగ్‌ మాల్స్‌, సూపర్‌ బజార్‌లలో వస్తువుల విక్రయాలు జరపడం లేదని తూనికల కొలతల శాఖకు భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్పందించిన అధికారులు తనిఖీలు చేపట్టగా అసలు విషయం బైటపడింది. దీంతో నిబంధనలు పాటించని బడా షాపింగ్ మాల్స్ అధికారులు కేసు నమోదు చేశారు.