హైదరాబాద్: ప్రస్తుతం బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంటున్న హేతువాది బాబు గోగినేనిపై 13 సెక్షన్ల కింద హైదరాబాదులోని మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మత విశ్వాసాలను కించపరుస్తున్నాడని, భారత విదేశాంగ విధానానికి ఆటంకం కలిగించే విధంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయనపై కొంత మంది ఫిర్యాదు చేశారు. 

అంతేకాకుండా గోప్యత పాటించాల్సిన ఆధార్ సమాచారాన్ని బాబు గోగినేని, అతని అనుచరులు వాళ్ల సంస్థల ద్వారా విదేశాలకు అందజేస్తున్నారని, ఇది దేశ భద్రతకు కూడా ప్రమాదంగా మారుతుందని ఫిర్యాదులో ఆరోపించారు. 

సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్‌కు బాబు గోగినేని ఫౌండర్‌గా ఉన్నారని, మలేషియాలో దీనికి సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తారని వారు ఫిర్యాదు చేశారు. హేతువాద సమావేశాలంటూ సభ్యులకు ఆహ్వానం పలికి తప్పనిసరిగా వారి ఆధార్ నెంబర్‌ను గోగినేని ముఠా తీసుకుంటోందని, ఆ ఆధార్ నెంబర్లను వెబ్‌సైట్‌లో బహిర్గతం చేయడం ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోయిందని, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని వారన్నారు. 

హైదరాబాద్, బెంగళూరు, విశాఖలో ఇటీవల బాబు గోగినేని ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్స్‌లో పాల్గొనాలంటే ఆధార్ నెంబర్ తీసుకోవడమే కాకుండా ఆ నెంబర్లను వెబ్ సైట్‌లో పెట్టారని ఆరోపించారు. దీంతో మాదాపూర్ పోలీసులు బాబు గోగినేనిపై కేసు నమోదు చేశారు.