వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లగా... ఆ నీటిలో మునిగి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. 

వరంగల్: తెల్లవారుజామున వేగంగా వెళుతున్న ఓ కారు నీటి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. కాలువ నీటిలో మునిగి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో కారును కెనాల్ నుండి బయటకు లాగారు. గల్లంతయిన వారికోసం గాలింపు చేపట్టారు. 

ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తెలుస్తోంది. అతివేగంతో వెళుతున్న కారు అదుపుతప్పడం వల్లే కారు కెనాల్ లోకి దూసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కొంకపాక శివారులో ఎస్సారెస్పీ కెనాల్ లో చోటుచేసుకుంది. 

కారు ప్రమాదంలో గల్లంతయిన వారి వివరాలు తెలియాల్సి వుంది. ఓ వైపు కాలువలో మృతదేహాలను గాలిస్తూనే మరోవైపు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే లభించిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.