అచ్చిరాని ఫిబ్రవరి: తండ్రి మరణించిన ఏడాదికే లాస్య నందిత మృతి
తండ్రి మరణించిన ఏడాదికే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించారు. తండ్రి, కూతురు కూడ ఫిబ్రవరి మాసంలో మరణించారు.
హైదరాబాద్: తండ్రి మరణించిన ఏడాదికే కూతురు మరణించడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. అనారోగ్యంతో ఎమ్మెల్యేగా ఉన్న జి.సాయన్న మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. సాయన్న మృతితో గత ఏడాది నవంబర్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందితను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ప్రజా యుద్దనౌక గద్దర్ కూతురు వెన్నెల పోటీ చేసింది. వెన్నెలపై లాస్య నందిత విజయం సాధించారు.
2023 ఫిబ్రవరి 19వ తేదీన సాయన్న అనారోగ్యంతో మరణించారు. సాయన్న మృతి చెంది ఏడాది దాటింది. నాలుగు రోజుల క్రితమే సాయన్న మృతి చెందిన ఏడాది దాటింది. తండ్రి మరణించిన ఏడాదికే లాస్య నందిత మృతి చెందారు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఫిబ్రవరి మాసంలో ఈ కుటుంబంలో వరుస సంఘటనలు జరగడంతో ఫిబ్రవరి నెల అచ్చిరాలేదని సాయన్న అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత లాస్య నందిత కొన్ని ప్రమాదాల నుండి తప్పించుకున్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొన్ని రోజులకే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో తిరిగి వస్తున్న సమయంలో లిఫ్ట్ లో ఆమె చిక్కుకుంది. లిఫ్ట్ లో చిక్కుకున్న ఆమెను కాపాడారు. ఈ నెల 13న నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ సభలో పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో లాస్య నందిత ప్రయాణీస్తున్న కారు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదం నుండి లాస్య నందిత బయటపడ్డారు. ఇవాళ తెల్లవారుజామున పటాన్ చెరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందారు.
లాస్య నందిత మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన దాదాపు మూడు మాసాలకే లాస్య నందిత మరణించారు. తండ్రి చూపిన మార్గంలో లాస్య నందిత రాజకీయాల్లోకి వచ్చారు. సాయన్న ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కార్పోరేటర్ గా ఆమె కొనసాగుతున్నారు. అయితే సాయన్న మరణంతో లాస్య నందితకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టిక్కెట్టు కేటాయించింది.