తెలంగాణలోని ప్రభుత్వ హాస్టల్స్‌లో మెస్ చార్జీల పెంపునకు మార్గం సుగమైంది. మెస్ చార్జీలను 25 శాతం పెంచాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 

తెలంగాణలోని ప్రభుత్వ హాస్టల్స్‌లో మెస్ చార్జీల పెంపునకు మార్గం సుగమైంది. మెస్ చార్జీలను 25 శాతం పెంచాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 1 నుంచి 7 తరగతుల వరకు రూ. 950 నుంచి రూ. 1200కు పెంపునకు, 8 నుంచి 10 తరగతులకు రూ. 1,100 నుంచి రూ. 1,400 పెంపునకు నిర్ణయం తీసుకుంది. అలాగే ఇంటర్ నుంచి పీజీ వరకు రూ. 1,500 నుంచి 1,875కు పెంచుతూ ప్రతిపాదనలను సిద్దం చేసింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్స్‌లో విద్యార్థులకు అందిస్తున్న మెస్ చార్జీలు సరిపోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం కూడా కష్టంగా మారింది. ఈ క్రమంలోనే మెస్ చార్జీల పెంపు కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య.. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్, గురుకుల విద్యార్థుల మెస్ చార్జీలను పెంచాలని కోరుతూ ఇటీవల తెలంగాణ సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. 

ఇక, గత నెల 26వ తేదీన ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద వందలాది మంది యువకులు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, మెస్ చార్జీలను పెంచాలని ఆందోళకు దిగారు. ఈ నిరసనల్లో పాల్గొన్న ఆర్ కృష్ణయ్య.. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీతాలను ప్రభుత్వం పెంచుతోందని, అదే విధంగా విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, మెస్ చార్జీలను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు.