అప్పు తీర్చమన్నందుకు నడి రోడ్డుమీద రాళ్లతో కొట్టి చంపిన దారుణ సంఘటన శంషాబాద్ లో చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు చెల్లించాలంటూ ఒత్తిడి చేసిన వడ్డీ వ్యాపారిని హోటల్ లో పనిచేస్తున్నవారితో కలిసి హోటల్ యజమాని నడి రోడ్డుపై రాళ్లతో పాశవికంగా దాడి చేసి చంపేశారు. 

ఈ దారుణ ఘటన రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ 248 వద్ద రహదారిపై ఈ నెల 10న అర్థరాత్రి జరిగింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు 12 గంటల్లోనే అరెస్ట్ చేశారు. 

శంషాబాద్ జోన్ కార్యాలయంలో డీసీపీ ఎన్. ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశంలో ఘటన వివరాలు వెళ్లడించారు. రాజేంద్రనగర్ ఎంఎం పహాడీకి చెందిన షేక్ రషీద్ (29) గరీబ్ నవాజ్ హోటల్ నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన వడ్డీ వ్యాపారి మహమ్మద్ ఖలీల్ (33) వద్ద నుంచి రూ. 15 లక్షలు అప్పు తీసుకున్నాడు. 

లాక్ డౌన్ కారణంగా రషీద్ వడ్డీ చెల్లించలేకపోవడంతో రూ. 22 లక్షలు ఇవ్వాలంటూ వడ్డీ వ్యాపారి ఒత్తిడి చేస్తున్నాడు. అప్పటికే రషీద్ అప్పుల్లో చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో రషీద్ వడ్డీ వ్యాపారి మహమ్మద్ ఖలీల్ ను మరో రూ. 50 లక్షలు అప్పు ఇస్తే ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తానన్నాడు. నువ్వడిగిన డబ్బులిస్తా కానీ.. నీ హోటల్ నాకు ఇచ్చేయమని అడిగాడు వడ్డీ వ్యాపారి. 

ఈ క్రమంలో ఆ వ్యాపారిని హత్య చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయని రషీద్ నిర్ణయించుకున్నాడు. తన హోటల్ లో వంట మనుషులగా పని చేస్తున్న అదే ప్రాంతానికి చెంది మహమ్మద్ అజ్మత్ (28), సయ్యద్ ఇమ్రాన్ (27)లతో కలిసి హత్యకు పథకం వేశాడు. అప్పు చెల్లిస్తా అంటూ నమ్మించి వడ్డీ వ్యాపారిని ఆదివారం రాత్రి పిలిపించాడు.

ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో రషీద్, మరో ఇద్దరు తమ వద్ద ఉన్న కత్తులతో ఖలీల్ పై మూకుమ్మడిగా దాడికి దిగారు. తప్పించుకుని పారిపోతున్న ఖలీల్ ను వెంటాడి బండరాళ్లతో తలపై మోది హత్య  చేశారు. 

ఆ తరువాత చనిపోయిన వ్యక్తి టూవీలర్ మీద ముగ్గురు పరారయ్యారు. సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.