బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని తాజ్ బంజారా హోటల్ కి ఓ వ్యాపారి పెద్ద టోపీ పెట్టాడు. హోటల్లో ఉండి రూ.లక్షల్లో బిల్లు చేసి చెల్లించకుండానే ఎగ్గొట్టి పరారయ్యాడు. వ్యాపారి బిల్లు ఎగ్గొట్టిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన హోటల్ జీఎం హితేంద్ర శర్మ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా... ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం వినాయకటెంపుల్ సమీపంలోని కిర్లంపుడి లేఅవుట్ లో ఉన్న సాగర్ దీప అపార్ట్ మెంట్స్ లో నివసించే అక్కిం శెట్టి శంకర్ నారాయణ్ గతేడాది ఏప్రిల్ 4న తాజ్ బంజారా హోటల్ కి వచ్చాడు. తాను ఏడాదిపాటు వ్యాపార నిమిత్తం ఇక్కడ బస చేస్తానని ఓకే గదిని తనకు దీర్ఘకాలిక ప్రాతిపదికన కేటాయించాల్సిందిగా కోరాడు. దీంతో గతేడాది ఏప్రిల్ 4న ఆయనకు హోటల్ లో రూమ్ నెంబర్ 405 కేటాయించారు.

మధ్యలో రూ.13.62లక్షల బిల్లును  చెల్లించాడు. అప్పటి నుంచి హోటల్ నిర్వాహకులను నమ్మిస్తూ తర్వాత బిల్లులు వాయిదా వేస్తూ వచ్చాడు. ఏప్రిల్ 15వ తేదీదన శంకర్ నారాయణ్ గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. రోజులు గడిచినా రాకపోవడంతో నిర్వహకులు సంప్రదిస్తూ వచ్చాడు. మొత్తం 102 రోజులకు గాను హోటల్ బిల్లు రూ.25,96,693 అయ్యింది. అందులో రూ.13,62,149 చెల్లించగా... మిగితా రూ.12,34,544 చెల్లించాల్సి ఉంది.

ఈ డబ్బు చెల్లించకుండానే అతను అక్కడి నుంచి పరారయ్యాడు. జూన్ 26వ తేదీన ఆయనకు హోటల్ సిబ్బంది ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. శంకర్ నారాయణ కోసం వెతికినా ఫలితం దక్కలేదు. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు.