భూ వివాదం ఓ వ్యాపారి ప్రాణం తీసింది. దాయాదులు అతనికి కిడ్నాప్ చేసి  అతి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఫరూఖ్‌నగర్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డి (55) కొన్నేళ్లుగా జడ్చర్లలో స్థిరపడి అక్కడే పెట్రోల్‌ బంకుల నిర్వహణతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. సొంత గ్రామంలో వ్యవసాయ పొలం ఉండటంతో అప్పుడప్పుడు అన్నారానికి వచ్చి వెళ్తుండేవాడు. కాగా పొలం విషయంలో రాంచంద్రారెడ్డికి అన్నారంలోని తన దాయాదులతో గతంలో ఘర్షణలు జరిగాయి. 

దీనిపై షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసులు సైతం నమోదయ్యాయి. తాజాగా భూ విషయంలో మాట్లాడుకుందామని దాయాదులు చెప్పడంతో రాంచంద్రారెడ్డి మధ్యాహ్నం డ్రైవర్‌ పాషాతో కలసి తన ఇన్నోవా వాహనంలో షాద్‌నగర్‌ పట్టణంలోని ఢిల్లీ వరల్డ్‌ స్కూల్‌ వైపు వచ్చాడు.

దీంతో భూమి విషయం మాట్లాడేందుకు దాయాదులు ఇన్నోవా కారు ఎక్కి మాట్లాడుతుండగా వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో వారు తమ వద్ద ఉన్న కత్తులను చూపించి బెదిరించడంతో డ్రైవర్‌ పాషా వాహనం దిగి పారిపోయాడు. 

ఇదే అదునుగా భావించిన వారు రాంచంద్రారెడ్డిని ఆయన వాహనంలోనే కిడ్నాప్‌ చేసి షాద్‌నగర్‌ నుంచి బైపాస్‌ రోడ్డు మీదుగా హైదరాబాద్‌ వైపునకు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. సెల్‌ఫోన్‌ ట్రాకింగ్‌ ఆధారంగా రాంచంద్రారెడ్డి కొత్తూరు మండలంలోని పెంజర్ల శివారులోని ఓ వెంచర్లో ఉన్నట్లు గుర్తించారు.

అక్కడి కారును పరిశీలించగా కత్తిపోట్లకు గురై కొనఊపిరితో ఉన్న కాంగ్రెసు నేత రాంచంద్రారెడ్డిని ప్రైవేటు వాహనంలో షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కాగా మార్గమధ్యలోనే రాంచంద్రారెడ్డి మృతి చెందాడు. గతంలో మృతుడు బాదేపల్లి సింగిల్‌ విండో చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. కొత్తూరులో సంఘటన స్థలాన్ని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఏసీపీ సురేందర్‌ పరిశీలించారు. అనంతరం క్లూస్‌టీం సభ్యులు ఆధారాలు సేకరించారు.