RSP: "అప్పుడే రాజీనామా చేసుంటే.. ప్రవళిక ప్రాణాలు పోయేవి కావు"
RSP: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) ఛైర్మన్ డా. జనార్ధన్ రెడ్డి రాజీనామాపై బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేశారు.
తెలంగాణలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి నేత్రుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కీలక పదవుల్లో ఉన్న పలువురు స్వయంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సమర్పించారు. జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. ఆ తర్వాత దాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి పంపించారు.
ఇదిలాఉంటే.. TSPSC ఛైర్మన్ డా. జనార్ధన్ రెడ్డి రాజీనామాపై బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఆయన రాజీనామాను స్వాగతించారు. మిగతా సభ్యులు కూడా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తన రాజీనామాను మార్చి నెల లోనే చేసుంటే బాగుంటుందనీ, అసలు నిజాలు ప్రజలకు తెలిసేవని మండిపడ్డారు. ప్రవళిక లాంటి నిరుద్యోగుల విలువైన ప్రాణాలు పోయేవి కావని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే విధంగా సిట్ (SIT) ఇన్వెస్టిగేషన్ అంతా అసలు నిందితులను రక్షించడానికే జరిగిందనీ, దాని మీద కూడా పూర్తి స్థాయి సమీక్ష జరపాలని నిరుద్యోగుల తరపున బీయస్పీ కోరుతున్నదని అన్నారు. ఈ సారైనా నీతికి, నిజాయితీకి, చక్కటి పరిపాలన దక్షతకు మారుపేరైన వ్యక్తులను రాజకీయాలకు అతీతంగా సభ్యులుగా నియమించగలరని నూతన ప్రభుత్వానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.