కర్ణాటకలో సిద్దరామయ్య చేతులెత్తేసాడు... రేపు రేవంత్ ఇంతేనా? : కేటీఆర్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వీడియో ఒకటి సోషల్ మీడియా చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది. ఎన్నికల హామీలపై అతడు మాట్లాడినట్లుగా వున్న వీడియోపై బిఆర్ఎస్ నేత కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. 

BRS Working President KTR Reacts on  Karnataka CM Siddaramaiah viral video AKP

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని మొదటినుండి బిఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తోంది.  పాలనపై, ఆర్థిక వ్యవహారాలపై కనీస అవగాహన లేకుండా నోటికొచ్చిన హామిలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని... ఇప్పుడు వాటిని ఎలా నెరవేరుస్తారో చూస్తామని బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఈ క్రమంలోనే పక్కరాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడం సాధ్యపడక చేతులు ఎత్తేసిందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య హామీల అమలుకు డబ్బులు లేవని అంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఇప్పుడు బిఆర్ఎస్ చేతికి అస్త్రంగా దొరికింది. 

అసెంబ్లీ వేదికగా కన్నడ సీఎం సిద్దరామయ్య మాట్లాడినట్లుగా ప్రచారం అవుతున్నవీడియోపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఎన్నికల హామీలు, గ్యారంటీలను నెరవేర్చేందుకు  డబ్బులు లేవని కర్ణాటక సీఎం అంటున్నారని...  భవిష్యత్ లో తెలంగాణలో ఇదే పరిస్థితి వుంటుందా?  అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రజలను మోసపూరిత హామీలతో నమ్మించి కాంగ్రెస్ గెలిచింది.. ఇప్పుడేమో నిధులు లేవంటూ చేతులెత్తేస్తోందని అన్నారు. హామీలు ఇచ్చేటపుడే వీటి అమలు సాధ్యమో కాదో ఆలోచించాల్సిందని... కనీస అవగాహన లేకుండా హామీలిస్తే ఇలాగే వుంటుందని కేటీఆర్ ఎద్దేవా చేసారు.

అయితే తాను అసెంబ్లీలో మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై దుమారం రేగడంతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. ఈ వీడియోలో వున్నది తానే అయినా మాటలు మాత్రం నిజంకాదన్నారు. బిజెపి నాయకులు తన వీడియోలను ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఒరిజినల్ వీడియోను సిద్దరామయ్య ఎక్స్ లో పోస్ట్ చేసారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎట్టిపరిస్థితుల్లో నెరవేరుస్తామని సిద్దరామయ్య స్పష్టం చేసారు. 

అంతేకాదు కేటీఆర్ ట్వీట్ పైనా సిద్దరామయ్య స్పందించారు.''మిస్టర్ కేటీఆర్ ... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా? మీకు నిజమేదో, అబద్దమేదో తెలీదు. కనీసం ఎడిట్ చేసిన నకిలీ వీడియోను కూడా గుర్తించలేరు. బిజెపి వాళ్లు క్రియేట్ చేసిన ఫేక్ వీడియోను మీరు నమ్మి ప్రచారం చేస్తున్నారు.  మీరు బిజెపికి బి టీమ్ అని తేలిపోయింది'' అంటూ  సిద్దరామయ్య మండిపడ్డారు. 

Also Read  లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ ... సీఎం రేవంత్ సహా మంత్రులందరికి కీలక బాధ్యతలు

ఇదిలావుంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కూడా హామీల అమలుపై మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలతో పాటు రైతుభీమా, రుణమాపి వంటి హామీలను ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. డిసెంబర్ 9నే రైతుబంధు డబ్బులు వేస్తామన్నారు... ఇప్పటివరకు ఎందుకు వేయలేదంటూ నిలదీసారు. ఇలా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రులు ప్రశ్నల వర్షం కురిపించారు. 

బిఆర్ఎస్ ప్రశ్నలతో దాడిచేస్తే అదేస్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఎదురుదాడి చేసారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసామని... మిగతావి కూడా త్వరలోనే ప్రజలను అందిస్తామని ప్రకటించారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు, ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పేదలు సంతోషిస్తున్నారని అన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios