బస్సుల్లో లాగే ఆటోల్లోనూ ఉచిత ప్రయాణం..! కేటీఆర్ తో ఆటోవాలా ఆసక్తికర సంభాషణ
ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆందోళనలకు దిగిన ఆటోవాలాాలకు కేటీఆర్ అండగా నిలిచారు, వారి సమస్యలు తెలుసుకునేందుకు ఆయన ఆటోలో ప్రయాణించారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను చవిచూసి బిఆర్ఎస్ పార్టీ ఓటమిపాలయ్యింది. తెలంగాణ ఏర్పాటుతర్వాత వరుసగా పదేళ్ల అధికారంలో వున్న బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. దీంతో రాష్ట్ర ప్రజలతో తమ కనెక్షన్ మిస్ అయ్యిందని గుర్తించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారితో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం మాజీ సీఎం తనయుడు, మాజీ మంత్రి అన్న హోదాను పక్కనబెట్టి అతి సామాన్యుడిలా ప్రజలమధ్యకు వెళుతున్నారు. ఇలా తాజాగా కార్లను, కాన్వాయ్ ని వదిలేసి ఆటోలో ప్రయాణించారు కేటీఆర్.
శనివారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటె కేటీఆర్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. యూసుఫ్ గూడలో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్న ఆయన తెలంగాణ భవన్ కు వెళ్లడానికి సిద్దమయ్యారు... ఇందుకోసం కారు, కాన్వాయ్ సిద్దమయ్యింది. కానీ కేటీఆర్ కారు ఎక్కకుండా ఓ ఆటోను ఆపి అందులో ఎక్కారు. తమ నాయకుడితో పాటే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా ఆటో ఎక్కారు. ఇలా ఆటోలోనే జూబ్లీహిల్స్ నుండి బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ కు చేరుకున్నారు కేటీఆర్.
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. దీంతో మహిళలతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి... ఇతర వాహనాల్లో మహిళల ప్రయాణం తక్కువయ్యింది. దీంతో గిరాకీలు లేక తాము తీవ్రంగా నష్టపోతున్నామని... కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని ఆటోవాలాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి సంఘీభావంగానే తాజాగా కేటీఆర్ ఆటోలో ప్రయాణించినట్లు బిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. డ్రైవర్ వద్దంటున్నా కేటీఆర్ అతడికి ఛార్జీ డబ్బులు చెల్లించారు.
Also Read KTR: 1953 తర్వాత తొలిసారి వారికి ప్రాతినిథ్యం లేదు.. రేవంత్ సర్కార్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెల్యే మాగంటితో కలిసి ఆటోలో ప్రయాణిస్తూ మార్గమధ్యలో డ్రైవర్ తో ముచ్చటించారు కేటీఆర్. ఆటో డ్రైవర్ల సమస్యలు, కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకంతో ఆటోవాలాల పరిస్థితి చాలా దుర్భరంగా మారిందని... తమను ఆదుకోవాలని నిరసనలు తెలిపుతూ కోరినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సదరు ఆటోడ్రైవర్ కేటీఆర్ కు తెలిపాడు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ముందు ఆటో డ్రైవర్ ఆసక్తికర ప్రతిపాదన వుంచినట్లు బిఆర్ఎస్ తెలిపింది. ప్రస్తుతం ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మాదిరిగానే ఆటోల్లోనూ ఉచిత ప్రయాణం కల్పించాలని... ఈ డబ్బులను ప్రభుత్వం తమకు రీయింబర్స్ చేస్తే బాగుంటుందని ఆటో డ్రైవర్ కేటీఆర్ తో చెప్పారట. ఈ విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ అధికారిక ఎక్స్ మాధ్యమం ద్వారా తెలిపింది.