అభిమాని కోరిక తీర్చిన కేటీఆర్ .. గాజులమ్మే వ్యక్తి ఇంట్లో భోజనం , బోరబండ వాసులకు సడెన్ సర్‌ప్రైజ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం హైదరాబాద్ బోరబండలో ఓ సామాన్యుడి ఇంట్లో సందడి చేశారు. పదేళ్లుగా రాష్ట్రానికి అందించిన సేవలకు గాను తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని కేటీఆర్‌ను ఇబ్రహీంఖాన్ కోరారు. ఈయన బోరబండలో గాజుల దుకాణం నడుపుతూ వుంటాడు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం హైదరాబాద్ బోరబండలో ఓ సామాన్యుడి ఇంట్లో సందడి చేశారు. ఇబ్రహీంఖాన్ అనే వ్యక్తి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా జనవరి 2న న్యూఇయర్ విషెస్ తెలియజేశారు. గత పదేళ్లుగా పగలు రాత్రి తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశారని ఇబ్రహీం ఖాన్ ప్రశంసించారు. తొలి ఐదేళ్ల కాలం ఇంటర్వెల్ మాదిరిగా గడిచిపోతుందని, పదేళ్లుగా రాష్ట్రానికి అందించిన సేవలకు గాను తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని కేటీఆర్‌ను ఇబ్రహీంఖాన్ కోరారు. ఈయన బోరబండలో గాజుల దుకాణం నడుపుతూ వుంటాడు.
దీనిపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్ ఖచ్చితంగా ఇంటికి వస్తానని మాట ఇచ్చారు. అన్న మాట ప్రకారం ఆదివారం బోరబండలోని ఇబ్రహీంఖాన్ ఇంటికి వెళ్లి వారిని ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా మాజీ మంత్రికి అతని కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఇబ్రహీంఖాన్ కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
అలాగే చెవుడుతో బాధపడుతున్న ఇబ్రహీంఖాన్ పిల్లలకు ఆర్ధిక సాయం చేసేందుకు కేటీఆర్ ముందుకు వచ్చారు. తారక రామారావు వెంట జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వున్నారు. ఓ సామాన్యుడి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ రావడంతో స్థానికులు, పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.