బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు మహారాష్ట్రలో కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీకి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ భాగస్వామ్యం అవుతుందని అన్నారు. ప్రజల ఎజెండాతో బీఆర్ఎస్ ఇక్కడ ముందుకు వస్తుందని తెలిపారు.  

పూణె: మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ భాగస్వామ్యం అవుతుందని, ప్రజల ఎజెండాతో ముందుకు వస్తామని ముంబయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అక్కడ విలేకరులతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, తెలంగాణ జరుగుతున్న అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని, పొరుగునే ఉన్న మహారాష్ట్రలో మరింత చర్చ జరుగుతున్నదని వివరించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఇక్కడ కూడా జరగాలని, తమ పార్టీని ఇక్కడికీ ఆహ్వానిస్తూ ప్రజలు 2014 నుంచే విజ్ఞప్తులు చేస్తున్నారని తెలిపారు. తమ పార్టీని మహారాష్ట్రలో విస్తరించాలని కోరుతున్నారని చెప్పారు. ఇక్కడి ప్రజలతో తెలంగాణ ప్రజలకు సమీప సంబంధాలున్నాయని అన్నారు. ఇక్కడ పుట్టిన అంబేద్కర్‌ను తెలంగాణ ప్రజల్లో గుండెల్లో పెట్టుకుంటారని, మహాత్మా పూలే విగ్రహాలు కూడా తెలంగాణ గ్రామాల్లో కనిపిస్తాయని వివరించారు. మరాఠా యోధుడు శివాజీ స్ఫూర్తి తీసుకుని బీఆర్ఎస్ మహారాష్ట్రలో అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.

స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో ఏళ్లు గడిచినా కనీస సదుపాయాలు ఇంకా చాలా చోట్ల అందుబాటులోకి రాలేవని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో తాగు నీరు, సాగు నీరు, విద్యుత్ వంటి అవసరాలను 98 శాతం తమ ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణే ఈ పని చేయగలిగితే మహారాష్ట్ర ఎందుకు చేయలేదు? మహారాష్ట్రనే కాదు.. మిగతా దేశమంతా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఎజెండాతో ముందుకు వస్తుందని, ఈ కనీస అవసరాలే ఎజెండాగా బీఆర్ఎస్ ఇక్కడ ముందుకు వస్తుందని చెప్పారు.

Also Read: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ లేఖ.. అందులో ఏమున్నదంటే?

హైదరాబాద్‌లో 24 గంటలపాటు తాగు నీరు అందుబాటులోకి తెచ్చామని, ముంబయిలో రెండు రోజులకు ఒకసారి మంచినీరు సరఫరా అవుతున్నదని వివరించారు. ఇక్కడ 24 గంటలు మంచి నీరు అందబాటులో ఎందుకు ఉంచలేకపోతున్నారని ప్రశ్నించారు. 

తాను ఓ టీవీలో మాట్లాడటానికి వచ్చానని కవిత చెప్పారు. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో కలుస్తారా? అని ఓ విలేకరి అడగ్గా.. కేసీఆర్‌కు శరద్ పవార్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని వివరించారు. తెలంగాణ ఏర్పాటు ఉద్యమానికి కూడా శరద్ పవార్ ఎంతో తోడ్పాటు అందించారని, తెలంగాణకు వచ్చి మరీ సహకరించారని తెలిపారు. 

థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ఒకటే ఫ్రంట్ ఉన్నదని, కాంగ్రెస్‌కు అంత బలం లేదని, కాబట్టి, సెకండ్ ఫ్రంటే లేదని వివరించారు. కేసీఆర్, ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి సెకండ్ ఫ్రంట్ నిర్మించే పనిలో ఉన్నారని వివరించారు.