బీఆర్‌ఎస్ గెలుపు.. ప్రభుత్వ ఏర్పాటుపై అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు..
Asaduddin Owaisi: ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా వారికే ఓటు వేయాలనీ, మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాషాయ పార్టీకి బీసీ అధ్యక్షుడు ఉండగా, ఆయనను తొలగించి అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా తీసుకున్నారని బీజేపీ తీరును ఓవైసీ విమర్శించారు.
Telangana Assembly Elections 2023: నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అలాగే, తాము పోటీ చేస్తున్న తొమ్మిది స్థానాల్లోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 'బీఆర్ఎస్ కచ్చితంగా తమ సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినన్ని సీట్లు బీఆర్ఎస్ కు వస్తాయన్న నమ్మకం నాకుంది. మేము పోటీ చేస్తున్న మొత్తం తొమ్మిది నియోజకవర్గాల్లో ఎంఐఎం విజయం సాధిస్తుంది' అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ మిత్రపక్షమైన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది సెగ్మెంట్లలో అభ్యర్థులను నిలబెట్టింది. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఏడు సీట్లు గెలుచుకుంది. నగరంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందనీ, ప్రజలు తమ పార్టీపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలు ఓట్లుగా మారుతాయనీ, కచ్చితంగా తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా వారికి, మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయాలని అసదుద్దీన్ ఇప్పటికే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బీజేపీ కుల గణన నిర్వహించడం లేదని కేంద్ర బీజేపీ సర్కారుపై మండిపడ్డ ఒవైసీ.. తెలంగాణలో కాషాయ పార్టీకి బీసీ అధ్యక్షుడు (బండి సంజయ్ కుమార్) ఉండగా, ఆయనను తొలగించి అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా తీసుకున్నారని విమర్శించారు. పార్లమెంటులో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో వారు రిజర్వేషన్లు (ఓబీసీ, ముస్లిం మహిళలకు సబ్ కోటా) ఇవ్వలేదని ఒవైసీ అన్నారు. కుల గణన చేయాలనుకోవడం లేదనీ, ఇది ఓబీసీలపై బీజేపీ వైఖరిని స్పష్టంగా బహిర్గతం చేస్తోందని ఒవైసీ అన్నారు. ఎంఐఎం ప్రాతినిధ్యం తర్వాత బీఆర్ఎస్ పాలనలో మైనారిటీల సంక్షేమం కోసం చేసిన కృషిని ఓవైసీ వివరించారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో రాష్ట్రంలో మత శాంతిని కాపాడామనీ, మూకదాడులు జరగలేదని అన్నారు.