Hyderabad: విద్వేషాలు రెచ్చగొట్టే విధ్వంసకర శక్తులను అరికట్టడంలో ఎన్నికల సంఘం (ఈసీ) విఫలమైందని తెలంగాణ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) అన్నారు. కేంద్రంలో భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్‌ఎస్‌) అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశ ప్రజలకు 24 గంటల విద్యుత్‌ అందిస్తామని పేర్కొన్నారు. 

Telangana Chief Minister KCR: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను పట్టిపీడిస్తున్న అనేక సమస్యలను ప్ర‌స్తావించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్).. విద్వేష జ్వాలలను రగిలిస్తూ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్న విచ్ఛిన్నకర శక్తులను, నెరవేర్చలేని తప్పుడు హామీలతో ప్రజలను ప్రలోభపెట్టడం వంటి చ‌ర్య‌ల‌ను అడ్డుకోవ‌డంలో ఎన్నికల సంఘం (ఈసీ) విఫలమైందని విమర్శించారు. ప్ర‌స్తుతం బీఆర్ఎస్ త‌న విస్త‌ర‌ణ ప్రణాళిక‌ల‌తో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలోనే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన ప్రముఖ నాయకులకు స్వాగతం పలికిన అనంత‌రం కేసీఆర్ మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, దేశ రాజకీయ రంగంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందనీ, మతతత్వ ఎజెండాకు భారతీయ జనతా పార్టీ, తప్పుడు వాగ్దానాలకు కాంగ్రెస్ కారణమంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అలాంటి శక్తులు తమ ప్రమాదకర ఎజెండాను కొనసాగించకుండా నిరోధించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని అన్నారు. అయితే, ఇత‌ర‌హా తీరును అడ్డుకోవ‌డానికి సంకల్పంతో ప్రజలు, మేధావులు ఏకమైతేనే ఆశించిన మార్పులు తీసుకురాగలమ‌ని అన్నారు.

భారత్ మార్పును కోరుకుంటోందనీ, మేధావులు ఆ దిశగా ఆలోచించాలన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేధావులంతా ఏకతాటిపైకి రావాలని, దిల్ వాలే, దిమాఖ్ వాలేల ఐక్యత అవసరమని అన్నారు. దేశంలో నీరు, భూమి, బొగ్గు నిల్వలు, అనుకూల వాతావరణం వంటి పుష్కలమైన సహజ వనరులు ఉన్నాయ‌నీ, అయిన‌ప్ప‌టికీ దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. దీనికి కారణం కేంద్రంలోని పాలకులు దృష్టి సారించకపోవడమేన‌నీ, 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో దళితులు, బహుజనులు సహా అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని కేసీఆర్ అన్నారు. రాజకీయ పార్టీలు మారడం ఆప్షన్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. "ఒక పార్టీ ఓడిపోతే దాని స్థానంలో మరో పార్టీ వస్తుంది. ఇది కేవలం పేర్ల మార్పు మాత్రమే. అధికారంలో ఉన్న నేతల పేర్లు మారుతుంటాయి. కానీ ప్రజల అదృష్టంలో మార్పు రాదని, ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, దాని పనితీరులో మార్పు తీసుకురావచ్చని" ఆయన స్పష్టం చేశారు.

కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో భారత ప్రజలకు 24 గంటల విద్యుత్ అందిస్తామని పునరుద్ఘాటించిన కేసీఆర్.. బీఆర్ఎస్ కేవలం రాజకీయ పార్టీ కాదనీ, భారతదేశాన్ని మార్చే మిషన్ అని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయనీ, దళిత బంధు, రైతుబంధు, రైతుబీమా, రైతులకు ఉచిత విద్యుత్, తెలంగాణలో అమలవుతున్న పింఛన్ పథకాలను వివరించారు. వీటిని తెలంగాణలో విజయవంతంగా అమలు చేయగలిగితే మధ్యప్రదేశ్ లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అలాగే, ఈ త‌ర‌హా ప‌థ‌కాల గురించి కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. ఇతరుల కోసం ఎదురుచూడకుండా మన సమస్యలను పరిష్కరించుకోవాలని కేసీఆర్ అన్నారు.