Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ వైరస్.. బీజేపీ వ్యాక్సిన్.. ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలి : బండి సంజయ్

బీఆర్ఎస్ వైరస్ లాంటిది అంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా మీద ఫ్లెక్సీలు వేసినట్టు మీ మీద వేస్తే ముఖం ఎక్కడ పెట్టుకుంటారంటూ ప్రశ్నించారు.

BRS virus.. BJP vaccine.. Bandi Sanjay comments
Author
First Published Dec 14, 2022, 2:05 PM IST

జగిత్యాల : తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు మీద మండిపడ్డారు. టీఆర్ఎస్ కు చెందిన  కొందరు ఎమ్మెల్యేలు చేసిన తప్పుల చిట్టాను కేసీఆర్ తన దగ్గర పెట్టుకున్నాడని… దీంతో వారి మీద బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నాడని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. డ్రగ్స్ కేసు వ్యవహారాన్ని బిజెపి వదిలి పెట్టబోదని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా గంగాధర మండలం తుర్గాసిపల్లిలో ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనమీద టిఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఆయన స్పందించారు.  

బండి సంజయ్ ను ప్రశ్నిస్తూ టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎంపీగా తానేం చేయాలో చేస్తున్నానని అన్నారు. టిఆర్ఎస్ నేతలు ఏం చేస్తున్నారో ముందు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. దీంతోపాటు బిఆర్ఎస్ మీద  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘బిఆర్ఎస్ ఓ వైరస్.. బీజేపీ ఓ వ్యాక్సిన్.. వైరస్ కావాలా?  వ్యాక్సిన్ కావాలో.. అనేది ప్రజలే తేల్చుకోవాలి అన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు నిర్వాసితులను టీఆర్ఎస్ నేతలు ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. కొండగట్టు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదంటూ ప్రశ్నించారు.

ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కోమటిరెడ్డి భేటీ: పార్టీ పరిస్థితులపై చర్చ

నయీమ్ మీద, డ్రగ్స్ కేసుల మీద గతంలో వేసిన సిట్ నివేదికలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. బీజేపీ కార్యకర్తలు సహనంతో ఉన్నారని.. వాళ్ల సహనాన్ని పరీక్షించొద్దని చెప్పుకొచ్చాడు. మేము కూడా మీలాగా ప్లెక్సీలు పెట్టగలం. అలా పెట్టడం మొదలుపెడితే మీ ముఖాలు ఎత్తుకోలేరు.. అని హెచ్చరించారు. అంతేకాదు తెలంగాణలో ప్రభుత్వం మారాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. 

ఇదిలా ఉండగా, మంగళవారం ఎమ్మెల్సీ కవిత మీద విరుచుకుపడ్డారు బండి సంజయ్.. ‘ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారు అనేసరికి రాష్ట్రంలో మహిళలు వారి కళ్లలోంచి నిప్పులు కురిపించాలా అని ప్రశ్నల వర్షం కురిపించారు.  తెలంగాణలో ఆడపిల్లలపై అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు జరుగుతుంటే మీ కళ్లలోంచి నిప్పులెందుకు కురియడం లేదని సంజయ్ దుయ్యబట్టారు. కల్వకుంట్ల కుటుంబానికి మానవ హక్కులపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన ఎద్దేవా చేశారు. మానవ హక్కులను కాలరాస్తోంది మీ అయ్యే.. అంటూ కవితపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ మానవత్వం లేని మృగం అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. 

అంతకుముందు మంగళవారం ఎమ్మెల్సీ కవిత బండిసంజయ్ వ్యాఖ్యల మీద మీడియాతో మాట్లాడారు. ఆమె బండి సంజయ్ మాట్లాడిన పదజాలం అవమానకరంగా ఉందని ఆరోపించారు. బండి సంజయ్ తన పదవికి మచ్చ తెచ్చే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. మహిళల్ని అవహేళన చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో బీజేపీని తిప్పకొడతారన్నారు. బతుకమ్మను అవమానించేలా బండి సంజయ్ మాట్లాడారని.. ఆ మాటలు బాధ కలిగించాయని కవిత చెప్పారు. బీఆర్ఎస్‌తో బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్ అయిందని ఎద్దేవా చేశారు..

Follow Us:
Download App:
  • android
  • ios