కేసీఆర్‌పై తిరుగుబాటు బావుటా.. బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గంపై వేటు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వైరా నియోజకవర్గానికి చెందిన 20 మంది నేతలపై బీఆర్ఎస్ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశమైన నేతలను సస్పెండ్ చేసింది.

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌లో మాజీ ఎంపీ పొంగులేటి వర్గంపై పార్టీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్‌పై తిరుగుబాబు చేసిన వైరా నియోజకవర్గానికి చెందిన 20 మంది నేతలపై బీఆర్ఎస్ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. వీరిలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్ , వైరా పురపాలక ఛైర్మన్ జైపాల్ సహా మరో 18 మంది వున్నారు. బీఆర్ఎస్ పెద్దలతో పొంగులేటికి గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మండల స్థాయి నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఐదు మండలాలకు చెందిన నేతలతో శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ అధిష్టానం.. పొంగులేటితో సమావేశమైన నేతలను సస్పెండ్ చేసింది.
ఇదిలావుండగా.. శుక్రవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో కార్యాలయాలను ప్రారంభించనున్నట్టుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ప్రజలకు అండగా ఉంటానని , తన సత్తా ఏమిటో నిరూపిస్తానన్నారు. నాయకులు , కార్యకర్తల భరోసా కోసమే తాను పర్యటించనున్నట్టుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి ఆత్మీయ సమ్మేళనాలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అభిమానులు, అనుచరులతో భేటీ అవుతున్నారు. ఈ నెల 6వ తేదీన కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.
ALso REad: నా సత్తా ఏమిటో చూపిస్తా: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆత్మీయ సమ్మేళనాల్లో బీఆర్ఎస్ పై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు పొంగులేటి. దీంతో శ్రీనివాస్ రెడ్డికి ఉన్న సెక్యూరిటీని ప్రభుత్వం తగ్గించింది. దీంతో బీఆర్ఎస్ పై ఆయన నేరుగానే విమర్శలు చేస్తున్నారు. తనకు ఇచ్చిన హమీని బీఆర్ఎస్ నాయకత్వం అమలు చేయలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇంతకాలం పాటు తనను అవమానించారని.. తనకు కానీ, తన అనుచరులకు కానీ పదవులు ఇవ్వలేదన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొందరి ఓటమికి కారణమనే నెపం వేసి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు .
కాగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడుతారని చాలా కాలంగా ప్రచారం సాగుతుంది. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గత నెల 18న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం కానున్నారని ప్రచారం సాగింది. కానీ అమిత్ షాతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ కాలేదు. కాంగ్రెస్ పార్టీ నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆహ్వానం అందింది. మరోవైపు పొంగులేటి తమ పార్టీలో చేరుతారని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటించారు.