తెలంగాణ ప్రజలను అవమానపర్చడమే.. అమిత్ షా రాష్ట్ర విలీనం వ్యాఖ్యలపై దాసోజు శ్రవణ్ ఫైర్..
Hyderabad: తెలంగాణ విలీనంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. అమిత్ షా తెలంగాణ ప్రజలను, భారత స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను అవమానించారన్నారు.
BRS senior leader Dasoju Sravan: భారత యూనియన్‌లో తెలంగాణ విలీనానికి సంబంధించి ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. అమిత్ షా ఆదిలాబాద్‌లో ప్రసంగిస్తూ తెలంగాణ ప్రజలను, భారత స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను అవమానించారని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలలోని వ్యంగ్యాన్ని శ్రవణ్ ఎత్తిచూపుతూ.. ఒక రాష్ట్రం, ప్రాంతం, మతం లేదా కులానికి చెందే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాతో సహా భారతీయ పౌరులందరూ మొదట భారతీయులని గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
అమిత్ షా సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కేవలం గుజరాతీ నాయకుడిగా గుర్తించడంపై కూడా బీఆర్ఎస్ నాయకుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. పటేల్ జాతీయ నాయకుడనీ, భారతరత్న గ్రహీత అని ఆయన పేర్కొన్నారు. “మహాత్మా గాంధీని గుజరాత్‌కే పరిమితం చేయనట్లే, సర్దార్ పటేల్‌ను కూడా గుజరాత్‌కే పరిమితం చేయలేరు. వాస్తవానికి, జాతీయ నాయకులందరికీ సరిహద్దులు, పరిమితులు లేవు. కులం, మతం, ప్రాంతం, మతం మొదలైన లేబుల్‌లు లేవు” అని అన్నారు.
భారత యూనియన్‌లో తెలంగాణ విలీనానికి సర్దార్ పటేల్ మాత్రమే కారణమని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను శ్రవణ్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు గుజరాతీ ఆధిపత్యానికి నిదర్శనమనీ , తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రజల పోరాటాలు, త్యాగాలకు అవమానం అని ఆయన అభివర్ణించారు. లక్షలాది మంది తెలంగాణ ప్రజల సామూహిక పోరాటాలు, త్యాగాలు, రక్తపాతం ఫలితంగానే తెలంగాణ భారత యూనియన్‌లో విలీనమైందనీ, ఇది ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం కాకూడదని పేర్కొన్నారు.
అంతకుముందు, తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన విమర్శలపై రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ స్పందిస్తూ, రాష్ట్రంలో ప్రజలను తప్పుదోవ పట్టించడం పని చేయదనీ, ఈసారి నవంబర్ 30 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్లో 110 మందికి పైగా డిపాజిట్లు కోల్పోతారని అన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ లో జరిగిన జన గర్జన సభలో అమిత్ షా ప్రసంగిస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. భారత్ లో తలసరి ఆదాయం 300 శాతానికి పైగా పెరిగిన రాష్ట్రం పేరు చెప్పాలని అమిత్ షాను కోరుతున్నామన్నారు. అలాంటి బీజేపీ పాలిత లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాన్ని తమకు చూపించాలని డిమాండ్ చేశారు. అపూర్వమైన అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రం తెలంగాణ... తెలంగాణ కంటే మెరుగైన పనితీరు కనబరిచిన బీజేపీ పాలిత రాష్ట్రాన్ని చూపించండి అంటూ వ్యాఖ్యానించారు.