తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేత రాజీవ్ సాగర్ ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ కవితను ఈడీ అరెస్టు చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అని పరుష పదజాలంతో మాట్లాడారని అన్నారు. బండి సంజయ్ మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ మహిళలు, ప్రజలు తలదించుకునే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళ నేడు రోడ్డెక్కి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. బండి సంజయ్‌పై చర్యలు తీసుకోని మహిళ హక్కులను కాపాడాలని కోరారు.
ఇక, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌తో పాటు.. ఇటు రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బండి సంజయ్‌కు, బీజేపీకి వ్యతిరేక నినాదాలు చేయడంతో పాటు.. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. మరోవైపు బండి సంజయ్‌పై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్‌లలో బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బండి సంజయ్‌పై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బండి సంజయ్‌పై కేసు నమోదు చేశారు. ఇక, ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా బండి సంజయ్‌పై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉంటే.. బండి సంజయ్ చేసిన కామెంట్స్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అంశాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలపై విచారణ జరపాలని మహిళా కమిషన్ డీజీపీని ఆదేశిచింది. ఇందుకు సంబంధించి బండి సంజయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. బండి సంజయ్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవల బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించే క్రమంలో.. ‘కవితని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా…’ అంటూ బండి సంజయ్ కామెంట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత వికెట్ పడిపోయిందని.. అతి త్వరలో బీఆర్ఎస్‌లో మరికొంతమంది క్లీన్ బౌల్డ్ అవుతారని అన్నారు. మద్యం కుంభకోణం, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. అయితే కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
