ఎంపీ బండి సంజయ్ పై బీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సాక్షిగా బండి అబద్ధాలు మాట్లాడారని, బహిరంగ సభలో మాట్లాడినట్టు బఫూన్‌లా మాట్లాడారని ఫైర్ అయ్యారు. తెలంగాణ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తామని వార్నింగ్ ఇచ్చారు. 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదంటే రైతులే బండి సంజయ్‌ను తరిమి కొడతారని అన్నారు. 

న్యూఢిల్లీ: లోక్ సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. పార్లమెంట సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు. తెలంగాణ అంటేనే కేంద్ర ప్రభుత్వానికి గిట్టడం లేదని దుయ్యబట్టారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

లోక్ సభలో బండి సంజయ్ బీఆర్ఎస్ పై విమర్శలు సంధించారు. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని, బీజేపీ మద్దతుతోనే తెలంగాణ సాధ్యమైందని పేర్కొన్నారు. 1400 మంది విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్సే కారణం అని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ చీఫ్, ఆయన కుటుంబం ఆస్తులు వందల రెట్లు పెరిగాయని ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి ఉన్నదని, కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు రాష్ట్రానికి అందాయని అన్నారు.

లోక్ సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానాన్ని బీఆర్ఎస్ కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సభలో వివరించామని పార్లమెంటు అనంతరం మీడియాతో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు అన్నారు.

ప్రధాని తెలంగాణ గురించి మచ్చుకైనా మాట్లాడలేదని, బండి సంజయ్ నోటికొచ్చినట్టు వాగాడని బీఆర్ఎస్ ఎంపీ నామా పేర్కొన్నారు. పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని అన్నారు. దీంతో నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేశామని వివరించారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టడమే వారి పని అని ఆరోపించారు. తెలంగాణ అంటేనే కేంద్రానికి గిట్టడం లేదని పేర్కొన్నారు. రైతుల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని, 24 గంటల కరెంట్ లేదని అంటే బండి సంజయ్‌ను రైతులు ఉరికిస్తూ కొడతారని అన్నారు.

Also Read: పెరిగిన కేసీఆర్ కుటుంబ ఆస్తులు, కాంగ్రెస్‌కు డిపాజిట్లే రాలేదు: లోక్‌సభలో బండి ఫైర్

రాష్ట్రంలో బండి సంజయ్ తోక కత్తిరించినా మోడీని పొగుడుతూ మార్కులు కొట్టేయాలని చూశాడని బీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. తెలంగాణ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 86 వేల కోట్లు ఇచ్చామని పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. బండి సంజయ్ బహిరంగ సభలో మాట్లాడినట్టు పార్లమెంటులో మాట్లాడారని, బఫూన్‌లా డ్రామా వేశాడని ఫైర్ అయ్యారు.