అదానీ కంపెనీ అవకతవకలతో పేదలపై పెనుభారం: బీఆర్ఎస్ ఎంపీ నామా
అదానీ కంపెనీ అవకతవకలతో పేదలపై భారం పడిందని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు చెప్పారు.
హైదరాబాద్: అదానీ కంపెనీ అవకతవకలతో పేద ప్రజలపై పెను భారం పడిందని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు చెప్పారు.శుక్రవారం నాడు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అదానీ కంపెనీలపై చర్చకు కేంద్రం వెనుకడుగు వేస్తుందన్నారు.
అదానీ వ్యవహరంపై జేపీసీ, సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. ఈ విషయమై విపక్ష పార్టీలను బీఆర్ఎస్ సమన్వయం చేస్తుందని ఆయన చెప్పారు.
తక్కువ టైమ్ లో అదానీ అత్యంత ధనవంతుడయ్యాడని బీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు తెలిపారు.
అదానీ కంపెనీల్లో అవకతవకలు జరిగాయని హిండెన్ బర్గ్ నివేదిక తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదానీ వ్యవస్థగా ఎలా మారాడని ఆయన ప్రశ్నించారు. రోడ్లు, బొగ్గు, విద్యుత్ , మైనింగ్ రంగాల్లో అదానీ కంపెనీలే కీలకంగా మారాయన్నారు.
అదానీ కంపెనీల్లో అవకతవకలపై ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. ఈ విషయమై చర్చకు విపక్షాలు పట్టుబడ్డాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉభయ సభలు పలు మార్లు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన తర్వాత ఉభయ సభలు ప్రారంభమైనా పరిస్థితుల్లో మార్పు రాలేదు. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.