మెజారిటీ ఉందనే గర్వంతో అహంతో కేంద్రం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రోజెక్ట్‌కు ఒక్క పైసా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని కేకే గుర్తుచేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు. ఆదివారం తోటి ఎంపీలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి జరగట్లేదన్న ప్రధాని మాటల్లో నిజం లేదని.. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. ప్రతి రంగం అభివృద్ధిలో ముందుందని.. దేశంలో ఎక్కడ కూడా తెలంగాణ మాదిరి అభివృద్ధి లేదని కేశవరావు పేర్కొన్నారు.
ఏపి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేంద్రం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం స్వయంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుందని.. కాళేశ్వరం ప్రోజెక్ట్‌కు ఒక్క పైసా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని కేకే గుర్తుచేశారు. జాతీయ రహదారులపై భారీగా టోల్ టాక్స్‌లు వసూలు చేస్తున్నారని.. మెజారిటీ ఉందనే గర్వంతో అహంతో కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఇది ప్రజాస్వామ్యనికి మంచిది కాదని కేశవరావు హితవు పలికారు.
Also Read: "ఆ నలుగురు నాలుగు పైసలు కూడా తీసుకరాలే.. ": బీజేపీ ఎంపీలపై బోయినపల్లి వినోద్‌కుమార్ ఫైర్
మరో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు మోడీ వచ్చి ఇచ్చిన ప్రసంగాల్లో ప్రతిసారి తెలంగాణ ఎందుకు ఏర్పడింది అన్నట్టుగా ఉందన్నారు. ఎప్పుడూ తెలంగాణపై విషం కక్కుతున్నారని సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లలో ఒక్క చట్టంలోనూ మార్పులు తీసుకురాలేదని.. పోరాటాలతోనే తెలంగాణ ఏర్పడిందని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా సీఎం కెసీఆర్‌ను, కెసీఆర్ కుటుంబాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధిపైన ఏది మాట్లాడరని.. గతంలో ప్రధానులు వస్తుంటే భయంతో వణికిపోయేవారని ఇప్పుడు కూడా అదే పరిస్థితులు కలుగుతున్నాయన్నారు. రాష్ట్రం నుండి వెళ్లిన టాక్స్‌లు, నిధులెన్ని, మీరు ఇన్నేళ్లలో ఇస్తున్నది ఎంతని సురేష్ రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడ వేగంగా తెలంగాణ అభివృద్ది చెందుతుందో మోడీ గమనించాలని ఆయన సూచించారు. కుటుంబపాలన అంటున్నారు నిజమేనని తెలంగాణ ప్రజలు మొత్తం కేసిఆర్ కుటుంబమేనని సురేష్ రెడ్డి అభివర్ణించారు.
