పవిత్రమైన బతుకమ్మపై మందుబాటిలా..!: జీవన్ రెడ్డిపై కవిత సీరియస్

ఇటీవల తనపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సీఎం కేసీఆర్ కూతురు కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

BRS MLC Kavitha Serious on Congress MLC Jeevan Reddy AKP

జగిత్యాల : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. ఇలా తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను లిక్కర్ క్వీన్ అని... బతుకమ్మపై మందుబాటిల్ పెట్టే రకం ఆమె అంటూ  కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన కవిత కాంగ్రెస్ ఎమ్మెల్సీకి కౌంటరిచ్చారు. 

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటంచేసిన బిడ్డలు ప్రాణాలు తీసుకునేందుకు కారకురాలు సోనియా గాంధీ... అలాంటిది ఆమెను తెలంగాణ దేవత అనడం దారుణమన్నారు. మన బిడ్డల ప్రాణాలుతీసిన ఆమె బలిదేవత అని కవిత పేర్కొన్నారు. సోనియా గాంధీ కుటుంబానికి తెలంగాణతో విద్రోహ బంధం వుందని అన్నారు. తానేమీ సోనియాలా ఇటలీ రాణిని కాదని కవిత అన్నారు. 

ఇక రాహుల్ గాంధీ  ఎక్కడ ఎన్నికలు వుంటే అక్కడ వాలిపోతాడని... ఆ తర్వాత మళ్ళీ  కనిపించడని కవిత అన్నారు. కాబట్టి ఆయనకు రాహుల్ గాంధీ కంటే ఎలక్షన్ గాంధీ అనే పేరే సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేసారు. సొంతంగా మాట్లాడటం ఎలాగూ రాదు... కాబట్టి రాహుల్ తన స్క్రిప్ట్ రైటర్లను మార్చుకుంటే మంచిదని కవిత సలహా ఇచ్చారు. 

Read More  లిక్కర్ క్వీన్.. బతుకమ్మపై గౌరమ్మను కాదు మందు బాటిల్ పెడతావేమో.. : కవితపై జీవన్ రెడ్డి ఫైర్

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకుంటోందని కవిత గుర్తుచేసారు. ఆనాటి ఉద్యమనేత కేసీఆర్ చావునోట్లో తలపెట్టి స్వరాష్ట్రాన్ని సాధించారని... కాంగ్రెస్ ఊరికే ఇవ్వలేదని అన్నారు. ఇలా ఏర్పడిన తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం సుపరిపాలన సాగిస్తోందన్నారు. అందువల్లే ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు, దేశం కాని దేశాలకు వలస వెళ్లే పరిస్థితి మారిందని... స్వరాష్ట్రంలోనే తెలంగాణ ప్రజలకు మంచి ఉపాధి లభిస్తోందని అన్నారు.  

కేవలం ఎన్నికల కోసం రాజకీయాల్లో ఎంతో సీనియారిటీ వున్న జీవన్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని కవిత మండిపడ్డారు. ఇకనైనా ఆయన హుందాగా నడుచుకుంటే బావుంటుందని... దిగజారుడు మాటలు మానుకోవాలని హెచ్చరించారు. పవిత్రమైన బతుకమ్మపై మందుబాటిల్ పెడతారంటూ జీవన్ రెడ్డి మాట్లాడటం దారుణమని... ఆయన మాటలను తెలంగాణ మహిళాలోకం సహించదని అన్నారు. కాబట్టి వెంటనే జీవన్ రెడ్డి మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు.  
 
జీవన్ రెడ్డికి సీనియారిటి ఉంది కానీ సిన్సియారిటి లేదని కవిత ఎద్దేవా చేసారు. షుగర్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసింది నిజాం సర్కార్... వాటిని తమ ప్రభుత్వాలు అమ్ముతుంటే చూసింది జీవన్ రెడ్డి అని మండిపడ్డారు. చివరకు సింగరేణి బొగ్గును ప్రైవేట్ సంస్థలకు అమ్మిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. అలాంటి సింగరేణి గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా వుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios