సారాంశం

తెలంగాణ ఆడపడుచుల పండగ బతుకమ్మ ఖ్యాతి దేశవిదేశాలకు పాకింది. భారత జాాగృతి యూకే విభాగం ఈసారి కూడా తమ దేశంలో బతుకమ్మ సంబరాల నిర్వహణకు సిద్దమయ్యింది. 

హైదరాబాద్ : తెలంగాణ పూలపండగ బతుకమ్మ సంబరాలను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు భారత జాగృతి సిద్దమయ్యింది. తెలంగాణ ఆడబిడ్డలు ఎక్కడున్నా బతుకమ్మ పండగను జరుపుకునేందుకు ఇష్టపడతారు. ఇది గుర్తించిన భారత జాగృతి కేవలం తెలంగాణలోనే కాదు దేశ విదేశాల్లోనూ బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తోంది. ఇలా అక్టోబర్ 21న యూకేలో బతుకమ్మ వేడుకల నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బతుకమ్మ పండగ కన్నులపండగగా జరుగుతోంది. తెలంగాణలోనే కాదు ఇతర దేశాల్లో స్థిరపడ్డ ఆడపడుచులు సైతం బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇలా ప్రతి ఏటా భారత జాగృతి యూకే విభాగం కూడా 'మెగా బతుకమ్మ' పేరిట వేడుకలు నిర్వహిస్తుంది. ఈ బతుకమ్మ వేడుకలో కేవలం తెలంగాణవారే కాదు ప్రవాసీలంతా పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు. 

ఈ బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ అనంతరం కవిత మాట్లాడుతూ... తెలంగాణ బతుకమ్మకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. విదేశాల్లో వున్న భారత జాగృతి కార్యకర్తల కృషి ఫలితంగానే బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటిందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు మరిచిపోకుండా విదేశాల్లో స్థిరపడ్డ ఆడపడుచులు బతుకమ్మ ఆడటం చూస్తుంటే చాలా సంతోషంగా వుంటుందన్నారు కవిత. 

Read More  ఫొటోల ఫోజుల కోస‌మే.. ప్రధాని మోడీ స్వచ్ఛభారత్ మిషన్ పై కేటీఆర్ ఫైర్

బతుకమ్మ వేడుకల ద్వారా చేనేత కార్మికులకు అండగా వుండాలని జాగృతి యూకే విభాగం నూతన ఆలోచనతో ముందుకు వచ్చిందని కవిత అన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే మహిళలకు ఉచితంగా చేనేత చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించారని... ఇందుకు భారత జాగృతి యూకే విభాగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని కవిత అన్నారు.