Asianet News TeluguAsianet News Telugu

బిఆర్ఎస్ కు మరో షాక్ తప్పదా..? కాంగ్రెస్ గూటికి ఆ విద్యాసంస్థల అధినేత?

టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో వున్న అధికార భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరడానికి సిద్దమైనట్లు రాజకీయ ప్రచారం జోరందుకుంది. 

BRS MLC Kasireddy Narayana Reddy ready to join congress Party? AKP
Author
First Published Sep 27, 2023, 12:42 PM IST

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ప్రచార జోరు పెంచారు. ఇలా అందరికంటే ముందే అభ్యర్థుల ప్రకటనతో ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలకున్న బిఆర్ఎస్ ప్రయత్నం కాస్త బెడిసికొట్లు కనిపిస్తోంది.టికెట్లు ఆశించి భంగపడ్డ తుమ్మల నాగేశ్వరరావువంటి సీనియర్లు సైతం పార్టీని వీడుతున్నారు. అలాగే టికెట్ దక్కని కొందరు సిట్టింగ్ లతో పాటు టికెట్ దక్కిన మైనంపల్లి హన్మంతరావు లాంటి వారు కూడా బిఆర్ఎస్ కు షాకిస్తున్నారు. ఇలా ఇప్పటికే పలువురు బిఆర్ఎస్ నేతలు పార్టీని వీడగా మరికొందరు కూడా ఇతర పార్టీల్లో చేరడానికి సిద్దమయ్యారు. తాజాగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడానికి సిద్దమయ్యారంటూ ప్రచారం జోరందుకుంది. 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి టికెట్ ను ఆశించారు ఎమ్మెల్సీ కసిరెడ్డి. బిఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను కూడా తనకు అవకాశం ఇవ్వాలని పలు సందర్భాల్లో కోరారు. కానీ కొందరు మినహా అందరు సిట్టింగ్ లనే మరోసారి బరిలో దింపాలని కేసీఆర్ నిర్ణయించారు. దీంతో కల్వకుర్తి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు దక్కింది. ఇలా టికెట్ ఆశించి భంగపడ్డ కసిరెడ్డి  తీవ్ర అసంతృప్తితో బిఆర్ఎస్ పార్టీని వీడాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

ఇప్పటికే కాంగ్రెస్ నాయకులతో టచ్ లోకి వెళ్లిన ఎమ్మెల్సీ కసిరెడ్డికి కల్వకుర్తి టికెట్ హామీ కూడా లభించిందట. దీంతో రెండుమూడు రోజుల్లో కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. తన సన్నిహితులు, అనుచరులు, కల్వకుర్తికి చెందిన నాయకులతో నిన్న ఎమ్మెల్సీ భేటీ అయ్యారు. తన భవిష్యత్ రాజకీయాల గురించి చర్చించేందుకే ఆయన ఈ సమావేశం ఏర్పాటుచేసినట్లు సమాచారం. బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరాలన్న నిర్ణయంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మొత్తంగా బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత కసిరెడ్డి నారాయణరెడ్డి బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడం ఖాయమైనట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 

Read More  అయోమయంలో ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ నేతలు.. ఇంతకీ పార్టీ టికెట్​ దక్కించుకునేదెవరు..?

ఇదిలావుంటే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ లో చేరికలు జోరందుకుంటున్నాయి. బిఆర్ఎస్ తో పాటు బిజెపి నుండి కాంగ్రెస్ లోకి నాయకుల వలసలు కొనసాగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ జోరుమీద వుండగా బిఆర్ఎస్, బిజెపి లు బేజారు అవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఓ సమయంలో బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపియే అనే పరిస్థితి వుండగా... ఎన్నికల వేళ ఆ పార్టీ పూర్తిగా డీలాపడిపోయింది. అధ్యక్ష పదవినుండి బండి సంజయ్ తొలగింపు తర్వాత బిజెపి జోరుతగ్గి కాంగ్రెస్ ఊపు పెరిగింది. అయితే ఈ ఊపు ఎక్కడా తగ్గకుండా ఎన్నికల వరకు కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసమే సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో వరుసగా సభలు ఏర్పాటుచేస్తూ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.

ఇక అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించడం అధికార బిఆర్ఎస్ కు కొంచెం ప్లస్, మరికొంత మైనస్ అయ్యింది. టికెట్ దక్కిన నాయకులు ప్రజల్లోకి వెళ్లడానికి చాలా సమయం దొరికితే... టికెట్ దక్కని నాయకులకు కూడా ఇతర పార్టీలో సంప్రదింపులు జరిపేందుకు అంతే సమయం దొరికింది. ఇలా అసంతృప్త నేతలు ఒక్కోకరుగా కాంగ్రెస్ గూటికి చేరుకుతున్నారు. కొందరు నాయకులను మాత్రం పార్టీ వీడకుండా చూడటంలో బిఆర్ఎస్ సక్సెస్ అయ్యింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios