అయోమయంలో ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ నేతలు.. ఇంతకీ పార్టీ టికెట్ దక్కించుకునేదెవరు..?
Palamuru: మహబూబ్ నగర్ కాంగ్రెస్ సీటును వలస వచ్చిన నేతలకు కాకుండా స్థానికంగా ఉన్న బీసీ నేతలకే టికెట్ ఇవ్వాలని ఎన్ పి వెంకటేష్ తో సహా అక్కడికి వెళ్లిన నాయకులంతా గట్టిగానే తమ వాదనను వినిపించినట్లుగా సమాచారం.

Palamuru: మహబూబ్ నగర్ నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకోవడానికి ఆ పార్టీ నేత ఎంపీ వెంకటేష్ ఉన్నట్లుండి గేర్ మార్చారు. మంగళవారం నాడు ఆయన భారీగా తరలివచ్చిన తన అనుచరులతో కలిసి హైదరాబాదులో ఉన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటుగా కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే లను కలిసి టిక్కెట్ విషయం చర్చించినట్లుగా తెలుస్తోంది.
మహబూబ్ నగర్ కాంగ్రెస్ సీటును వలస వచ్చిన నేతలకు కాకుండా స్థానికంగా ఉన్న బీసీ నేతలకే టికెట్ ఇవ్వాలని ఎన్ పి వెంకటేష్ తో సహా అక్కడికి వెళ్లిన నాయకులంతా గట్టిగానే తమ వాదనను వినిపించినట్లుగా సమాచారం. ఇటీవల పార్టీలో చేరిన మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్న నేపథ్యంలో స్థానికంగా టికెట్టు కోసం దరఖాస్తు చేసిన ఆశావాహులు మొత్తం అలర్ట్ అయ్యారు. అయితే ఉన్నట్లుండి కాంగ్రెస్ నేత వెంకటేష్ హైదరాబాదుకు భారీగా అనుచరులతో తరలివెళ్లడం వెనుక అసలు వ్యూహం ఏమిటని ఆ పార్టీ నాయకులే తర్జన భర్జనలు పడుతున్నారు.
మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసిన వారిలో ముగ్గురు బీసీ నేతలు ఉన్నారు. వీరులో ఎన్ పీ వెంకటేష్, సంజీవ్ ముదిరాజ్, రాఘవేంద్ర రాజులు ఉన్నారు. అయితే వెంకటేష్ మాత్రం బిసి కోటాలో తమ నాయకుడికి మాత్రమే టికెట్ దక్కాలని పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు వారు ఆదివారం నాడు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఎదుట బీసీ నాయకులకు టికెట్ ఇవ్వాలని... సర్వేల్లో ఎవరికి ఎక్కువగా మార్కులు వస్తే వారికి ఇవ్వాలంటూ మెలికలు పెట్టి ఆందోళనకు దిగారు.
ఆదివారం, మంగళవారం నాటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారాయి అని చెప్పాలి. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వెంకటేష్ కు టికెట్ ఇస్తే ఆ వర్గం ఓట్లు గంపగుత్తగా వస్తాయని దీంతోపాటే కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓట్లు కూడా తమ ఖాతాలోనే పడతాయని ఆయన వర్గం వారు వాదిస్తున్నారు. ఓవైపు సంజీవ్ ముదిరాజ్ కూడా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. అయితే వెంకటేష్ , సంజీవ్ ఇద్దరు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు కావడం ఇక్కడ విశేషం అని చెప్పాలి. అధిష్టానం వీరిలో ఎవరి పట్ల మొగ్గుచూపుతోందో వేచి చూడాల్సిందే.