కార్యకర్తలను అధిష్టానానికి కలవకుండా చేశారు: నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ రివ్యూలో కవిత సంచలనం
నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: నిజామాబాద్ లో ఓటమిపై పార్టీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు.
భారత రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలతో సమీక్ష సమావేశం సోమవారంనాడు హైద్రాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సహా ఆ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ పనితీరుపై జిల్లాకు చెందిన నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాని ఆమె సూచించారు. నిజామాబాద్ ఎంపీ సీటు గెలిచి కేసీఆర్ కు బహుమతి ఇవ్వాలని ఆమె పార్టీ నేతలను కోరారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ వంద శాతం గెలిచి తీరుతుందని ఆమె ధీమాను వ్యక్తం చేశారు.
పార్టీ అదిష్టానాన్ని కార్యకర్తలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని కవిత అభిప్రాయపడ్డారు.ఎమ్మెల్యేలకు కేసీఆర్ పూర్తి ప్రాధాన్యం ఇచ్చారన్నారు.కానీ పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఇవ్వలేదని కవిత ఆరోపించారు.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ సమీక్ష సమావేశంలో కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీశాయి. 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి కవిత ఓటమి పాలయ్యాడు.
వచ్చే ఎన్నికల్లో కూడ ఇదే పార్లమెంట్ స్థానం నుండి కవిత పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.భారత రాష్ట్ర సమితికి నిజామాబాద్ జిల్లాలో గట్టి పట్టుంది. అలాంటి జిల్లాల్లో కూడ ఇద్దరు కీలక నేతలు ఓటమి పాలు కావడం చర్చకు దారి తీసింది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సన్నద్దమౌతున్నాయి.ఈ తరుణంలో కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఎవరిని ఉద్దేశించి చేశారనే చర్చ సాగుతుంది. నిజామాాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కవిత ఓటమి పాలు కావడానికి పార్టీ ప్రజా ప్రతినిధులు సక్రమంగా పనిచేయలేదనే అభిప్రాయాలు కూడ అప్పట్లో వ్యక్తమయ్యాయి. గెలిచిపోయామనే విశ్వాసంతో బీఆర్ఎస్ నేతలు వ్యవహరించడం అప్పట్లో కవిత కొంపముంచిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు . గతంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల పరిణామాలనుద్దేశించి కవిత వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.