హైద్రాబాద్ చేరుకున్న కల్వకుంట్ల కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ ఉదయం న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ కు చేరుకున్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారంనాడు హైద్రాబాద్ కు చేరుకున్నారు. ఈ నెల 19వ తేదీన కవిత న్యూఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు హాజరయ్యేందకు కవిత ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం న్యూఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో కవిత బృందం హైద్రాబాద్ కు బయలుదేరింది. న్యూఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసం వద్ద మీడియా ప్రతినిధులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కవిత.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మూడు దఫాలు కవిత ఈడీ విచారణను ఎదుర్కొన్నారు.ఈ నెల 11,20, 21 తేదీల్లో కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. మరోసారి విచారణ విషయ మై ఈడీ నుండి సమాచారం లేకపోవడంతో కవిత న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ కు చేరుకున్నారు.
ఈ నెల 6వ తేదీన అరుణ్ రామచంద్రపిళ్లైని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఈడీ అధికారులు కవితకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 8వ తేదీన కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలని కోరారు. అయితే ముందుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నందున విచారణకు రాలేనని కవిత ఈడీకి లేఖ రాశారు. ఈ నెల 11న ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. ఈ నెల 16న విచారణకు రావాలని కవితకు ఈడీ అధికారులు నోటీసులు పంపారు.
also read:న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ బయలుదేరిన కవిత
అయితే ఈ నెల 15న ఢిల్లీకి చేరుకున్నప్పటికీ ఈ నెల 16న ఈడీ విచారణకు కవిత హాజరు కాలేదు. ఈడీ అడిగిన సమాచారాన్ని కవిత బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా పంపారు. ఈడీ విచారణపై తాను దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈనెల 24న విచారించనున్నందున అప్పటివరకు విచారణకు రాలేనని కవిత ఈడీకి భరత్ ద్వారా లేఖ పంపారు. కానీ ఈ నెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో విచారణకు కవిత హాజరు కావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.