డిల్లీ లిక్కర్ స్కాంపై ఈడీ ప్రశ్నలు... నాా సమాధానాలివే : అర్థరాత్రి కేసీఆర్ తో కవిత భేటీ
డిల్లీ లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఈడీ విచారణ అనంతరం అర్ధరాత్రి హైదరాబాద్ కు చేరుకుని తండ్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు.
హైదరాబాద్ :డిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన పాత్ర వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శనివారం ఈడి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారించింది. ఇప్పటికే ఈ స్కాం కు పాల్పడ్డారంటూ డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు చాలామందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కవితను కూడా అరెస్ట్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ శనివారం దేశ రాజధాని న్యూడిల్లీలోని ఈడి కార్యాలయంలో సుదీర్ఘ విచారణ అనంతరం మళ్ళీ విచారణకు హాజరుకావాలంటూ కవితను పంపించారు అధికారులు. దీంతో కవిత అరెస్ట్ ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడింది.
శనివారం రాత్రివరకు ఈడీ విచారణ సాగగా అర్థరాత్రి డిల్లీ నుండి హైదారాబాద్ కు చేరుకున్నారు కవిత. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు.శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. బేగంపేట నుండి నేరుగా ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం ప్రగతి భవన్ కు చేరుకున్న కవిత తండ్రి కేసీఆర్ తో భేటీ అయినట్లు సమాచారం. ఈడీ విచారించిన తీరు, సంధించిన ప్రశ్నలు, తాను ఏం సమాధానం చెప్పింది... ఇలా నిన్న డిల్లీలో జరిగిన పరిణామాల గురించి కేసీఆర్ కు వివరించారు కవిత. అలాగే మళ్ళీ విచారణకు హాజరుకావాలని కవితను ఈడీ ఆదేశించిన నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపైనా కేసీఆర్, కవిత చర్చించుకున్నట్లు సమాచారం.
Read More ఢిల్లీ లిక్కర్ స్కాం.. ముగిసిన కవిత విచారణ, 16న మళ్లీ రమ్మన్న ఈడీ
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలో వున్న న్యూడిల్లీలో కొత్త మద్యం పాలసీలో భారీ అవకతవకలు జరిగాయని... ఇందులో కవిత కీలక పాత్ర వహించినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన రామచంద్ర పిళ్లై తమ విచారణలో కవితకు బినామీగా వ్యవహరించినట్లు ఒప్పుకున్నాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో కవితను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంతో ఆమెను కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది.దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా డిల్లీకి చేరుకుని ఆందోళనకు సిద్దమయ్యారు. కానీ ఎలాంటి అరెస్ట్ లేకపోవడంతో కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు.
ఇప్పటికే డిల్లీ లిక్కర్ స్కాం ను విచారిస్తున్న సిబిఐ కూడా కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో విచారించింది. ఈ స్కాంలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈడి కూడా విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం విచారణకు హాజరైన కవితను ఐదుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం కవితపై పలు ప్రశ్నలు సంధించారు. వీరిలో ఒక జాయింట్ డైరెక్టర్, లేడీ డిప్యూటీ డైరెక్టర్, ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లు వున్నారు. కాన్ఫన్‌ట్రేషన్ ఇంటరాగేషన్ పద్ధతిలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద కవితను పలు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. రామచంద్రపిళ్లై, కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించింది ఈడీ. ఆఫీస్ నుంచి బయటకొచ్చిన కవిత నేరుగా ఢిల్లీలోని తన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి బయల్దేరారు. అనంతరం అదే రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు.
అయితే మార్చి 16న మరోసారి కవితను విచారణకు హాజరు కావాలని ఈడి ఆదేశించింది. దీంతో కవిత అరెస్ట్ వాయిదా మాత్రమే అయ్యిందని... తదుపరి విచారణలో మరింత లోతుగా విచారణ జరిపి అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.