ఇలాంటి టైంలోనా ... ఆ నోటీసులు రద్దు చేయండి : సీబీఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద తనకు జారీ చేసిన నోటీసులను రద్దు కానీ, ఉపసంహరణ కానీ చేయాలని ఆమె లేఖలో కోరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటానని.. ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేనని ఆమె పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద తనకు జారీ చేసిన నోటీసులను రద్దు కానీ, ఉపసంహరణ కానీ చేయాలని ఆమె లేఖలో కోరారు. సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరయ్యేందుకు అందుబాటులో వుంటానని కవిత వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు వున్నందున ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. తనకు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని కవిత పేర్కొన్నారు.
2022 డిసెంబర్‌లో అప్పటి ఐవో తనకు ఇదే తరహాలో సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారని.. అప్పటి నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ పూర్తి విరుద్ధంగా వుందని ఆమె తెలిపారు. ఏ పరిస్ధితుల్లో తనకు సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదని.. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ నోటీసు ఇవ్వడం అనేక ప్రశ్నలకు తావునిస్తోందని కవిత ఆరోపించారు. తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది అ ప్రక్రియకు అవరోధం కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించి గతంలో ఈడీ జారీ చేసిన నోటీసులకు సుప్రీంకోర్టును ఆశ్రయించానని , ఆ కేసు సుప్రీంకోర్టు పరిధిలో వుందన్నారు. దీంతో తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారని.. ఇది సీబీఐకి కూడా వర్తిస్తుందన్నారు. సీబీఐ దర్యాప్తునకు తప్పకుండా సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటానని.. ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేనని ఆమె పేర్కొన్నారు.