కులాలు, మతాల వారీగా విభజన చేయలేదు: బోధన్ లో బీఆర్ఎస్ మీటింగ్ లో కవిత
బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులతో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
బోధన్: కులాలు, మతాల వారీగా ప్రజలను తమ ప్రభుత్వం విడగొట్టలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. కుల,మతాలకు తావు లేకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనం నిర్మించినట్టుగా ఆమె గుర్తు చేశారు.తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది జరిగిందని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వాల హయంలో ఈ రకమైన పరిస్థితి లేదన్నారు.
పదేళ్ల క్రితం ఎన్ని పెన్షన్లు వచ్చేవని ఆమె ప్రశ్నించారు. ఇవాళ ఎన్ని పెన్షన్లు వస్తున్నాయో ఆలోచించాలన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో బోధన్ నుండి ప్రాతినిథ్యం వహించిన సుదర్శన్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారని ఆమె గుర్తు చేశారు. కానీ బోధన్ నియోజకవర్గంలో ఒక్క చెరువునైనా ఆయన బాగు చేశారా అని ఆమె ప్రశ్నించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో బోధన్ నియోజకవర్గంలోని 155 చెరువులను బాగు చేసినట్టుగా కవిత ప్రస్తావించారు. సుదర్శన్ రెడ్డి పెద్ద వ్యాపారవేత్త, కానీ షకీల్ బీఆర్ఎస్ సామాన్య కార్యకర్త అని ఆమె చెప్పారు. కిందిస్థాయి నుండి షకీల్ ఉన్నత స్థాయికి ఎదిగిన విషయాన్ని ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా వివరించారు. అందరితో సమన్వయంతో ముందుకు వెళ్లే తత్వం షకీల్ కు ఉందన్నారు.
సీనియారిటీకి, సిన్సియారిటీకి మధ్య పోటీ ఉందని కవిత చెప్పారు.సీనియారిటీ కావాలో, సిన్సియారిటీ కావాలో తేల్చుకోవాలని ఆమె బోధన్ వాసులను కోరారు.తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని నేతలు, ప్రభుత్వంలో ఉండి కూడ ఉద్యోగాలు ఇవ్వనివారు తమపై విమర్శలు చేస్తున్నారని పరోక్షంగా కాంగ్రెస్ పై ఆమె మండిపడ్డారు.బోధన్ లో 4500 స్వయం సహాయక సంఘాలకు 2014 నుండి ఇప్పటి వరకు రూ. 2600 కోట్ల రుణాలు ఇచ్చినట్టుగా ఆమె చెప్పారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్క ఇంటికి చేర్చాలని ఆమె కోరారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని ఆమె చెప్పారు.
నిజామాబాద్ కు ఐటీ హబ్ ను తీసుకువచ్చినట్టుగా ఆమె గుర్తు చేశారు. గూగుల్, ఇన్ఫోసిస్ కంపెనీలను ఇక్కడికి తీసుకువస్తున్నట్టుగా ఆమె చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతల సమస్యలు తలెత్తలేదన్నారు. తెలంగాణలో దమ్ము, ధైర్యం ఉన్న నేత పాలిస్తున్నాడని కవిత చెప్పారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ. 4 వేల పెన్షన్లు ఇస్తున్నారా అని ఆమె రాహుల్ గాంధీని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ ను ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. కన్న తల్లికి బువ్వ పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని ఇచ్చే హామీలను నమ్మవద్దని ఆమె ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో షకీల్ కు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పార్టీ శ్రేణులను కోరారు.