పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. : రేవంత్, ఈటల పై కవిత ఫైర్
Kalvakuntla Kavitha: బీసీలకు లబ్ధి చేకూర్చడంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు రెండు స్థానాల్లో.. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సైతం కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించారు. కామారెడ్డితో పాటు హుజురాబాద్ నుంచి ఈటల పోటీ చేయనున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ మూడో జాబితాలో రేవంత్ ను కామారెడ్డి నుంచి కేసీఆర్ పై పోటీకి దించుతున్నట్టు ప్రకటించింది. రేవంత్ ఇప్పటికే కోడంగల్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నట్టుగా బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిలు ప్రకటించడంతో వారి తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు రేవంత్, ఈటల తీరు ఉందని చురకలంటించారు. "పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు... సీఎం కేసీఆర్ ను చూసి రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. వారికి వాతలే మిగులుతాయి తప్ప ఫలితం మాత్రం శూన్యం. వాళ్లు ఎన్ని చోట్ల పోటీ చేసినా విజయం మాత్రం బీఆర్ఎస్ పార్టీదే" అని కవిత పేర్కొన్నారు. కేసీఆర్ అంటే జాతీయ నాయకుడనీ, ముఖ్యమంత్రి ఆయనకు కొన్ని వ్యూహాలు ఉంటాయనీ, అందుకే రెండు చోట్ల పోటీ చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మూడు చోట్ల పోటీ చేసినా, రెండు చోట్ల పోటీ చేసినా చివరకు గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీయేనని కవిత ధీమా వ్యక్తంచేశారు.
అంతకుముందు కవిత మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వం కేవలం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఒకటి కాదనీ, ఇది వెనుకబడిన తరగతుల ప్రభుత్వమని అన్నారు. బీసీలకు లబ్ధి చేకూర్చడంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ కులాలు, వర్గాల కచ్చితమైన జనాభా తెలుసుకుని వారికి సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చాలా కాలంగా బీసీలను మోసం చేస్తున్నాయనీ, వారు చూపిస్తున్న ప్రేమ అంతా ఇంతేనని విమర్శించారు. తెలంగాణలో బీసీ సామాజికవర్గం అంటూ ప్రచారం చేయడం అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం వారి ఓట్లను రాబట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు.