ఇప్పుడున్న పరిస్థితుల్లో నియోజకవర్గానికి రావాల్సిన అవసరం లేదు: రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
జనగామ: ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను నియోజకవర్గానికి రావాల్సిన అవసరం లేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు.ఆదివారంనాడు నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తాటికొండ రాజయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. వచ్చే ఏడాది జనవరి 17 వరకు తానే ఎమ్మెల్యేనని ఆయన చెప్పారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సుప్రీం అని రాజయ్య చెప్పారు. డప్పు కొట్టాలన్నా, ఫ్లెక్సీ కట్టాలన్నా...కోలాటమాడాలన్నా భయపడుతున్నారని రాజయ్య వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు రాజయ్యకు బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించలేదు. రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి బీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది. తనకు టిక్కెట్టు దక్కకపోవడంతో రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గంలోని తన సన్నిహితుల వద్ద రాజయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజల మధ్యే ఉంటానని కూడ రాజయ్య ప్రకటించారు. అంతేకాదు గత మాసంలో వరంగల్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో రాజయ్య భేటీ అయ్యారు.ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
also read:కడియంతో చర్చే జరగలేదు.. బీఆర్ఎస్ బీఫాం నాదే: ఎమ్మెల్యే తాటికొండ సంచలన వ్యాఖ్యలు
మరో వైపు గత నెలలోనే కేటీఆర్ సమక్షంలో రాజయ్య, కడియం శ్రీహరిలు కలిసిన ఫోటో మీడియాలో వచ్చింది. అయితే కేటీఆర్ ను కలిసేందుకు తాను వెళ్లిన సమయంలో కడియం శ్రీహరి అక్కడే ఉన్నాడని తామిద్దరం కలిసి కేటీఆర్ ను కలవలేదని రాజయ్య చెప్పారు.కేటీఆర్ ను కలిసేందుకు వెళ్లిన సమయంలో అక్కడే ఉన్న కడియం శ్రీహరితో కలిసి ఫోటో దిగినట్టుగా గత నెల 24న రాజయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటన తర్వాత రాజయ్య, కడియం శ్రీహరి మధ్య రాజీకి బీఆర్ఎస్ నాయకత్వం మరోసారి ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఇవాళ రాజయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరోసారి చర్చకు దారి తీస్తున్నాయి.