కడియంతో చర్చే జరగలేదు.. బీఆర్ఎస్ బీఫాం నాదే: ఎమ్మెల్యే తాటికొండ సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ కడియంతో చర్చనే జరగలేదని, బీఆర్ఎస్ పార్టీ బీఫాం తనకే వస్తుందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. అవన్నీ మీడియా ఊహాగానాలేనని సయోధ్య వార్తలను కొట్టేశారు. ఒక వేళ తనకు టికెట్ రాకుంటే బరిలో నిలబడే విషయం కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు.

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ చొరవతో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య సయోధ్య కుదిరినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక వారిద్దరూ కలిసిపోయారని, వారి మధ్య విభేదాలు ఓ కొలిక్కి వచ్చాయని అనుకుంటుండగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కడియం శ్రీహరితో చర్చే జరగలేదని, బీఆర్ఎస్ టికెట్ తనకే దక్కుతుందని అన్నారు. ఒక వేళ తనకు టికెట్ దక్కకుంటే తన పోటీ విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. దీంతో కథ మొదటికి వచ్చినట్టు అనిపిస్తున్నది.
లింగాలగణపురం మండలంలో వడ్డీచర్లలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజయ్య డప్పు కొట్టి దరువేసి కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
కేటీఆర్ విదేశాలకు వెళ్లడానికి ముందు టికెట్ నాకే అని చెప్పారని, కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు కేటీఆర్ ఇక్కడ లేడని ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. దీంతో రెండు రోజుల క్రితం కేటీఆర్‌తో సమావేశమైనట్టు వివరించారు. అయితే, తనకు ఎమ్మెల్సీగానీ, ఎంపీగా గానీ అవకాశం ఉంటుందని చెప్పారని, అప్పటి వరకు స్టేట్ కార్పొరేషన్ నామినేటెడ్ పదవి తీసుకోవాలని సూచించినట్టు రాజయ్య తెలిపారు.
Also Read: ఈ ఏడాది చార్ ధామ్ యాత్రలో 200 మంది పర్యాటకుల మరణాలు
ఆ సమయంలో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు అక్కడే ఉన్నారని, దీంతో కేటీఆర్‌తో కలిసి అందరమూ ఫొటో దిగామని రాజయ్య చెప్పారు. అంతేతప్పా.. అక్కడ కడియంతో జరిగిన చర్చేమీ లేదని, కాబట్టి ఎవరూ ఆందోళన చెందవద్దని వివరించారు. సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారని, కానీ, బీఫాం ఇంకా ప్రకటించలేదని, సర్వే రిపోర్టుల బట్టి మార్పు చేర్పులు ఉంటాయని ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. కాబట్టి, బీఫాం తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక వేళ రాకుంటే తాను బరిలో నిలబడే విషయం కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. కడియంతో సయోధ్య కుదిరిందనేవన్నీ మీడియా ఊహాగానాలేనని కొట్టి పారేశారు.