Asianet News TeluguAsianet News Telugu

రుణమాఫీకి నిధులేవి , రైతుబంధుకు ముగింపు పలికేలా కాంగ్రెస్ : బడ్జెట్‌పై హరీశ్‌రావు విమర్శలు

రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. రైతుబంధుకు ముగింపు పలికేలా ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందని.. 6 గ్యారంటీల్లో 13 అంశాలు వున్నాయని హరీశ్ రావు చెప్పారు. 

brs mla harish rao reacts on telangana budget 2024 ksp
Author
First Published Feb 10, 2024, 4:56 PM IST

రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను గురువారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండ్ ఇస్తోందని.. రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హరీశ్ రావు పేర్కొన్నారు. నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెబుతున్నారని.. ఎక్కడా 14 నుంచి 15 గంటలు కరెంట్ రావడం లేదని ఆయన దుయ్యబట్టారు.

6 గ్యారంటీలపై చట్టం చేస్తామన్నారు ఏమైందని హరీశ్‌రావు ప్రశ్నించారు. 82 వేల కోట్లు అవసరమైతే .. బడ్జెట్‌లో ప్రతిపాదించింది 16 వేల కోట్లని ఆయన ఎద్దేవా చేశారు. నాడు కాంగ్రెస్ పాలనలో రైతులు ఆనందంగా వున్నారనడం జోక్ కాదా అని హరీశ్ దుయ్యబట్టారు. వడ్లకు బోనస్ అనేది బోగస్‌గా మారిపోయిందని.. 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధుకు ముగింపు పలికేలా ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందని.. 6 గ్యారంటీల్లో 13 అంశాలు వున్నాయని హరీశ్ రావు చెప్పారు. 

బడ్జెట్ అన్నదాతలను ఆగం చేసేలా వుందని.. శ్వేతపత్రాలతో కాంగ్రెస్ కాలం గడుపుతోందని ఆయన చురకలంటించారు. కొండంత ఆశ చూపి గోరంత కూడా కేటాయించని బడ్జెట్ ఇదని.. 2 హామీలు అమలు చేశామంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల కరెంట్‌పై రైతులకు బాండ్ పేపర్లు పంచలేదా అని ఆయన ప్రశ్నించారు. మీరు ప్రజలను మోసం చేస్తున్నారు.. ఆత్మవంచన చేసుకుంటున్నారని హరీశ్ దుయ్యబట్టారు. 

పంటల బోనస్‌కు రూ.15 వేల కోట్లు, రుణమాఫీకి రూ.40 వేల కోట్లు అవసరమన్నారు. ఇళ్ల నిర్మాణానికి రూ.23 వేల కోట్లు అవసరమవుతాయని.. ఇందిరమ్మ ఇళ్లకు రూ.7,700 కోట్లు పెట్టారని.. నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios