ఇద్దరు అనాథ ఆడపిల్లల చదువుకు సాయం.. అండగా నిలిచేందుకు ముందుకొచ్చిన బీఆర్ఎస్ నేత మాణిక్యం..
బీఆర్ఎస్ నేత, జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మంచి మనసు చాటుకున్నారు. మానవతా దృక్పథంతో ఇద్దరు అనాథ ఆడపిల్లల భవిష్యత్తు బాధ్యత తీసుకున్నారు.

బీఆర్ఎస్ నేత, జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మంచి మనసు చాటుకున్నారు. మానవతా దృక్పథంతో ఇద్దరు అనాథ ఆడపిల్లల భవిష్యత్తు బాధ్యత తీసుకున్నారు. వారి చదువుకు అన్ని విధాలుగా సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు పట్నం మాణిక్యం ఫౌండేషన్‌ను స్థాపించిన మాణిక్యం.. వారికి తక్షణ సాయంగా రూ. 50 వేలు అందజేశారు. వివరాలు.. కొండాపూర్ మండల కేంద్రంలో నివాసముంటున్న బేగరి మెర్సీ(12), బేగరి జాయ్సీ(15) అనే ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు మొగులయ్య, అమృత కొన్నేళ్ల క్రితం మృతి చెందడంతో అనాథలుగా మారారు.
అప్పటి నుంచి పిల్లలు కొండాపూర్‌లో మేనమామ కుటుంబంతో ఉంటున్నారు. స్థానిక కొండాపూర్‌లోని ఓ పాఠశాలలో మెర్సీ 7వ తరగతి, జాయ్సీ 10వ తరగతి చదువుతున్నారు. బుధవారం సంగారెడ్డిలోని తన నివాసంలో ఇద్దరి పిల్లలు, వారి మేనమామతో మాట్లాడిన మాణిక్యం.. వారి చదువు పూర్తయ్యే వరకు నెలనెలా భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. త్వరలో జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. జీవితంలో స్థిరపడే వరకు అండగా ఉంటానని తెలిపారు.