కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు ఇవాళ భేటీ అయ్యారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు శుక్రవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్‌లో చేరాలని కేశవరావు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఈ నెల 28న కేశవరావు మీడియాతో చిట్ చాట్ లో చెప్పారు. కాంగ్రెస్ లో చేరాలని తీసుకున్న నిర్ణయం గురించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా కేశవరావు వివరించారు. కేసీఆర్ తో భేటీ ముగిసిన తర్వాత హైద్రాబాద్ లో మీడియాతో కేశవరావు చిట్ చాట్ చేశారు. తాను కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నట్టుగా జీహెచ్ఎంసీ మేయర్ కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు.
కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్న మీదట కేశవరావు ఇవాళ రేవంత్ రెడ్డితో 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు.ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ కూడ ఉన్నారు. రేపు కేశవరావు, గద్వాల విజయలక్ష్మిలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ స్థానం నుండి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నాయకత్వం అవకాశం ఇచ్చింది. అయితే పోటీ నుండి వైదొలుగుతున్నట్టుగా కడియం కావ్య ప్రకటించారు. ఈ మేరకు కేసీఆర్ కు కావ్య లేఖ రాశారు. కడియం శ్రీహరి కూడ బీఆర్ఎస్ ను వీడుతారని ప్రచారం కూడ లేకపోలేదు.
గత వారం రోజుల క్రితమే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు కేశవరావుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఈ ఇద్దరిని ఆహ్వానించిన విషయం తెలిసిందే.