Asianet News TeluguAsianet News Telugu

గురువు చంద్రబాబు కోసమే ... కాళేశ్వరం కూలేలా రేవంత్ కుట్రలు : వినోద్ సంచలనం 

తెలంగాణ రైతాంగం కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయేలా కుట్రలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ, బిఆర్ఎస్ నేత బోయినిపల్లి వినోద్ ఆరోపించారు. తన గురువు చంద్రబాబు కోసమే సీఎం రేవంత్ ఇదంతా చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసారు. 

BRS Leader Boinipally Vinod Sensational comments on Kaleshwaram Project and CM Revanth Reddy AKP
Author
First Published Feb 28, 2024, 10:06 AM IST

వేములవాడ : ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా కేవలం కమీషన్లకు కక్కుర్తిపడే కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, పగుళ్లను చూస్తుంటేనే గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏమాత్రం చిత్తశుద్ది వుందో అర్థమవుతుందని ఎద్దేవా చేస్తున్నారు. ఇలా అధికారంలోకి వచ్చిన నాటినుండి కాళేశ్వరంను టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ కు బిఆర్ఎస్ కూడా కౌంటర్ ఇస్తోంది. తాజాగా మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కాళేశ్వరం వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.  

మేడిగడ్డ  బ్యారేజీలో 84 పిల్లర్లుంటే కేవలం రెండుమూడు మాత్రమే కుంగిపోయాయని... ఇదే అదునుగా సీఎం రేవంత్ రెడ్డి కొత్తకుట్రకు తెరలేపారని వినోద్ ఆరోపించారు. కుంగిన పిల్లర్లను రిపేర్ చేస్తే సరిపోతుంది... అలా చేయకుండా ప్రాజెక్ట్ మొత్తం ప్రమాదకరంగా వుందని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ప్రాజెక్ట్ కొట్టుకుపోవాలనే మరమ్మతులు చేయడంలేదని... ఇందులో భారీ కుట్ర దాగివుందని అన్నారు. బ్యారేజ్ కొట్టుకుపోతే నదీజలాలు దిగువన వున్న ఆంధ్ర ప్రదేశ్ కు వెళతాయి... ఇలాగే జరగాలన్నది రేవంత్ ప్లాన్ గా పేర్కొన్నారు.  తన గురువు చంద్రబాబు కోసమే రేవంత్ ఈ కుట్రలకు తెరతీసారని వినోద్ సంచలన ఆరోపణలు చేసారు. 

వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ... బాగా ఎత్తులో వున్న తెలంగాణలో గోదావరి జలాలను పారించడం కాళేశ్వరం ప్రాజెక్టుతోనే సాధ్యమయ్యిందని అన్నారు. దాదాపు 400 మీటర్ల ఎత్తును నదీజలాలను ఎత్తిపోసి కోటి ఎకరాలను సాగునీరు అందించామని అన్నారు. ఇలాంటి ప్రాజెక్ట్ గురించి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది... కానీ వారి మాటలు ప్రజలు నమ్మడంలేదని అన్నారు. అసలు నిజాలు చూపించేందుకే మార్చి 1న కాళేశ్వరం పర్యటనకు వెళుతున్నట్లు వినోద్ తెలిపారు.  

Also Read  కేటీఆర్ కీలక ప్రకటన.. 1న బీఆర్‌ఎస్‌ చలో మేడిగడ్డ..
 
ఇక చేవెళ్ళ సభలో సీఎం రేవంత్ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై చేసిన వ్యాఖ్యలకు వినోద్ కౌంటర్ ఇచ్చారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నిరోజులు అధికారంలో ఉంటుందని వేరే ఎవరో చర్చించుకోవాల్సిన అవసరం లేదు... ఆ పార్టీ వాళ్లే మాట్లాడుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులకే తమ పార్టీ నాయకులపై నమ్మకం లేదని... ఎప్పుడు ఎవరేం చేస్తారో ఎవరికీ అర్థంకాదని అన్నారు. కాబట్టి బిఆర్ఎస్ శ్రేణులు విశ్వాసంతో పని చేయాలని... తిరిగి తమ రాజ్యమే వస్తుందని వినోద్ అన్నారు. 

తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ వుంది... కాబట్టి లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని వినోద్ సూచించారు. 39 మంది ఎమ్మెల్యేలతో, గ్రామగ్రామాన బలమైన నాయకత్వంతో బిఆర్ఎస్ మెరుగ్గానే వుందని... తప్పిదాలను సరిదిద్దుకొని పార్టీ నిర్మాణాన్ని బ్రహ్మాండంగా చేసుకుందామన్నారు. బిఆర్ఎస్ పార్టీకి   శక్తి  బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు లేదన్నారు. బిజెపిది అతి విశ్వాసం అయితే కాంగ్రెస్ కు అసలు విశ్వాసమే లేదన్నారు. కాబట్టి కొద్దిగా కష్టపడితే కరీంనగర్ తో పాటు రాష్ట్రంలోని అన్ని లోక్ సభ స్థానాలను బిఆర్ఎస్ గెలుచుకోవచ్చని మాజీ ఎంపీ వినోద్ పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios